Begin typing your search above and press return to search.

25వేల మందికి మొండిచేయి చూపిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   25 Feb 2017 9:35 AM GMT
25వేల మందికి మొండిచేయి చూపిన కేసీఆర్‌
X
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం పక్కకు పెట్టినట్టే ఉందని విప‌క్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండదని, అధికారంలోకి రాగానే సర్వీసులు క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ప్రణాళికలో తెరాస హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటికీ క్రమబద్థీకరణ అతీగతి లేకుండా పోయింది. ఈ అంశంపై ఉస్మానియా వర్శిటీ విద్యార్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆగిపోయిందని శాసనసభ శీతాకాల సమావేశాలలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సభకు తెలిపారు. కోర్టులో పిటిషన్ పెండింగ్‌ లో ఉందన్న కుంటిసాకుతో క్రమబద్ధీకరణ ప్రక్రియను పక్కనపెట్టడం ఏమిటని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.మల్లన్నసాగర్ భూసేకరణపై బాధితుల తరఫున అనేక మంది పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఆర్డినెన్స్ తెచ్చి భూసేకరణ చట్టాన్ని సవరించి 123 జీవో తెచ్చిన ప్రభుత్వానికి, కోర్టులో పిటిషన్ పెద్ద ప్రతిబంధకమా? అని వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించడం వల్లనే తమ సర్వీసుల క్రమబద్దీకరణ జాప్యానికి కారణమ‌ని కొంద‌రు నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ అనేది వెట్టిచాకిరి తప్ప మరొటి కాదని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ ఎస్ అధికారంలోకి వచ్చాక వెట్టిచాకిరీకి స్వస్తి పలుకుతామని ఉద్యమ నేతగా కెసిఆర్ అనేక సభల్లో ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వకున్నా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సిఎం కెసిఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై కనీసం ఒక్కసారైనా సమీక్షించలేదని వాపోతున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పని చేస్తున్న 40 వేల చిలుకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించబోతున్నట్టు తొలి మంత్రివర్గ సమావేశంలోనే సిఎం ప్రకటించారు. తర్వాత రాజీవ్ శర్మ చైర్మన్‌ గా ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశంపై అధ్యయనం చేసి క్రమబద్ధీకరణకు అర్హులైన ఉద్యోగులు 25 వేల మంది మాత్రమే ఉన్నారని లెక్క తేల్చింది. ట్రెజరీ నుంచి వేతనాలు అందుకుంటున్న వారి సర్వీసులు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులుగా కమిటీ సిఫారసు చేసింది. హర్యానా - కర్నాటక రాష్ట్రాలలో జరిగిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఈ సిఫారసు చేసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 80 వేలమంది ఉన్నారని, వీరి సర్వీసులను క్రమబద్ధీకరించడం సాధ్యపడదని కమిటీ చేసిన సిఫారసు మేరకు వారికి వేతనాలను పెంచింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియామకం అయిన తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యాయం జరుగలేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. యుజిసి నిబంధన ప్రకారం కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడం కుదరదని ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గురుకుల విద్యాసంస్థ - ఉద్యానవనశాఖ - వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల ఖాళీ పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్‌ లో ఎక్కడా కాంట్రాక్టు ఉద్యోగుల ఊసు లేకపోవడం వీరిని మరింత ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి న్యాయం చేస్తారేమోనని కాంట్రాక్టు ఉద్యోగులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పక్కనపెట్టి తాజాగా నియామక ప్రక్రియను చేపట్టడంతో 25 వేల మంది ఉద్యోగుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/