Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌ర్వేఃవైసీపీకి 45 శాతం..టీడీపీకి 43%

By:  Tupaki Desk   |   27 July 2017 4:30 PM GMT
కేసీఆర్ స‌ర్వేఃవైసీపీకి 45 శాతం..టీడీపీకి 43%
X
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా ఢిల్లీలోని విలేక‌రుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. త‌న‌దైన శైలిలో ప్రాంతీయ - జాతీయ‌ - రాజ‌కీయ‌ - రాజకీయేత‌ర అంశాల‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ రియాక్ట‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీ రాజ‌కీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గ‌డ్డుకాలం వీస్తోంద‌ని - ప్ర‌తిప‌క్ష వైసీపీకి అధికారం ద‌క్కే చాన్స్ ఉంద‌ని కేసీఆర్ విశ్లేషించారు. ఆంధ్ర‌లో రాజ‌కీయ ప‌రిస్థితిపై చేసిన స‌ర్వే వివ‌రాలు ఓ మిత్రుడు చెప్పాడని 45శాతం వైఎస్సార్‌ సీపీ - 43శాతం టీడీపీ - 2.6 బీజేపీ - 1-1.2 ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ఓట్లు వ‌స్తాయని స‌ర్వే వివ‌రాలొచ్చాయని కేసీఆర్‌ అన్నారు. ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ త‌న‌దైన శైలిలో రియాక్ట‌య్యారు.

ఓటుకు నోటు కేసు ఇంకా క్లోజ్ కాలేదని కేసీఆర్‌ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ విఫ‌ల‌ప్ర‌యోగంగా మార్చే కుట్ర జ‌రిగిందని ఆయ‌న మండిప‌డ్డారు. అందుకే తాను అంతా సీరియ‌స్‌గా తీసుకున్నాన‌ని తెలిపారు. తొలుత రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌నే ప్ర‌య‌త్నం జ‌రిగిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక చంద్ర‌బాబుకు హైద‌రాబాద్‌ లో ప‌నేంటని కేసీఆర్ ప్ర‌శ్నించారు. నేనైతే ప‌దిరోజుల్లోనే విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చే వాడిన‌ని వ్యాఖ్యానించారు. ఏపీతో త‌మ‌కు ఇప్పుడు పెద్ద‌గా విభేదాలేమీ లేవని కేసీఆర్ తెలిపారు. అమ‌రావ‌తికి వెళ్లిన‌ప్పుడు బాబుకు ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్ట‌మ‌ని కోరాన‌ని ఆయ‌న తెలిపారు. ఏపీ తీర‌ప్రాంతంలో ఉండ‌డం వ‌ల్ల సాగునీటి ప్రాజెక్టుల‌తో మంచి అడ్వాంటేజ్ ఉందని వివ‌రించారు. ఎగువ‌రాష్ట్రాలు ఎంత వాడుకున్నా4వేల టిఎంసిల నీరు స‌ముద్రంలో వృథాగా క‌లుస్తోందని ఆయ‌న విశ్లేషించారు.

తెలంగాణ-ఏపీ పాలిటిక్స్‌పై కేసీఆర్ స్పందిస్తూ....తెలంగాణ‌లో కుల‌రాజ‌కీయాలు లేవని, ఆంధ్రాలో కుల‌రాజ‌కీయాలు ఇప్ప‌ట్లో వీడ‌వని విశ్లేషించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులూపితే ఓట్లు ప‌డ‌తాయా అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. పార్టీకి బేస్ ఉండాలని కేసీఆర్ విశ్లేషించారు. చిరంజీవి పార్టీని న‌డ‌ప‌లేక క‌ట్టెల‌మోపులాగా బ‌రువు దింపుకున్నాడని ఎద్దేవా చేశారు. తాను 14 ఏళ్లు పార్టీ న‌డిపా, ఉద్య‌మం చేశాన‌ని గుర్తు చేశారు. పోరాటానికి సిద్ధంగా ఉండాలి, ల‌క్ష్యం కోసం ప‌నిచేయాలని కేసీఆర్‌ తెలిపారు.