Begin typing your search above and press return to search.

కర్రవిరగకుండా పాము చచ్చే కేసీఆర్ ప్లాన్

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:00 AM GMT
కర్రవిరగకుండా పాము చచ్చే కేసీఆర్ ప్లాన్
X
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి ఈ తవ్వకాలు... యూరేనియం వెలికితీత, దాని వినియోగం, ప్రాజెక్ట్ వ్యయం..తవ్వే కాంట్రాక్టులన్నీ కేంద్రానివే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అనుమతులు మాత్రమే ఇస్తుంటుంది. అయితే కేంద్రం ఈ యురేనియం తవ్వకాలపై ముందడుగు వేస్తున్న వేళ వ్యూహాత్మకంగానే దీన్నో పెద్ద యుద్ధంలా తెలుగు రాష్ట్రాల్లో మీడియా - ప్రముఖులు మార్చేశారు..

నిజానికి యురేనియం తవ్వకాలతో చాలా నష్టాలు - ప్రమాదాలు ఉన్నాయి. అది కాదనలేని సత్యం. అయితే తెలంగాణ భూభాగంలో జరిగే ఈ తవ్వకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ నోరువిప్పింది లేదు. హరితహారం పేరిట మొక్కలు పీకేస్తేనే ప్రజాప్రతినిధులు - ఉద్యోగుల ఉద్యోగాలు ఊడబీకిస్తున్న కేసీఆర్ కేంద్రం తలపెట్టిన యురేనియం తవ్వకాలతో వేల కి.మీలలో విస్తరించిన నల్లమల అడవులను హరించే కేంద్రం యురేనియం ప్రాజెక్ట్ విషయంలో వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.

నిజానికి ఈ యురేనియం తవ్వకాలపై గళమెత్తిన పవన్ - విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు కేటీఆర్ కు చాలా దగ్గర. వారి ఇళ్లకు వెళ్లి కలిసి మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇక తాత కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఆయన మనవడు హిమాన్షుకు ఉండదు. కానీ యురేనియం తవ్వకాల విషయంలో కేటీఆర్ కుమారుడు కూడా ఉద్యమించడం విశేషం. ఈ పరిణామాలు చూశాక ఇది ఖచ్చితంగా టీఆర్ ఎస్ - కేసీఆర్ ప్రోద్బలంతోనే సాగుతున్న ఉద్యమమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనుమానిస్తున్నారట..

కేసీఆర్ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీని ఎదురించే పరిస్థితిలో లేరు. బీజేపీ బలంగా ఉంది. అలాగని ప్రకృతి విధ్వంసాన్ని కోరుకునే పరిస్థితిలో కూడా లేరు. అందుకే కర్ర విరగకుండా పాము చచ్చేలా ప్రజా ఉద్యమాన్ని విస్తరించి యురేనియం తవ్వకాలను నిలుపుదల చేసే సరికొత్త ఎత్తు వేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు యురేనియంపై ప్రజా ఉద్యమం చూశాక కేంద్రం వెనక్కు తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. సో కేసీఆర్ అండ్ కో వ్యూహాత్మకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది? ప్రజా వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటుందనేది వేచిచూడాలి..