Begin typing your search above and press return to search.

ఒంటేరు దెబ్బ‌కు గ‌జ్వేల్ నుంచి కేసీఆర్ ప‌రార్‌!

By:  Tupaki Desk   |   19 Oct 2018 10:02 AM GMT
ఒంటేరు దెబ్బ‌కు గ‌జ్వేల్ నుంచి కేసీఆర్ ప‌రార్‌!
X
తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి-టీఆర్ ఎస్ అధిప‌తి కేసీఆర్ ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో త‌న సిట్టింగ్ స్థానం గ‌జ్వేల్ నుంచి పోటీ చేయ‌రా? మేడ్చ‌ల్‌ లో పోటీ చేసే అవ‌కాశాల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తున్నారా? గ‌జ్వేల్‌ లో మ‌హాకూట‌మి అభ్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి త‌న‌ను ఓడిస్తార‌న్న భ‌య‌మే అందుకు కార‌ణ‌మా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి.

2014 ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్‌ లో ఒంటేరుపై కేసీఆర్ విజ‌యం సాధించారు. అయితే, ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితులు మారిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఒంటేరు బ‌రిలో దిగారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మంచి పేరుంది. కార్య‌క‌ర్త‌ల అండ ఉంది. ఇటీవ‌లే త‌న ఆప్త మిత్రుడు రేవంత్ రెడ్డితో క‌లిసి ఒంటేరు కాంగ్రెస్‌ లో చేరారు. తాజాగా మ‌హాకూట‌మి కూడా ఆవిర్భ‌వించిన నేప‌థ్యంలో.. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఒంటేరుకు ఇటు కాంగ్రెస్ నుంచి - అటు టీడీపీ నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీంతో కేసీఆర్ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేమీ కాద‌ని.. ఒంటేరు ఆయన్ను ఓడించే అవ‌కాశాల‌ను ఏమాత్రం కొట్టిపారేయ‌లేమ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కేసీఆర్ ప్రయివేటు సంస్థ‌ల‌తో చేయించిన స‌ర్వేలు - నిఘావ‌ర్గాల నివేదిక‌లు కూడా గ‌జ్వేల్‌ లో ఒంటేరు విజ‌యావ‌కాశాల‌ను స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్వ‌యంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హించిన‌ప్ప‌టికీ.. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌ని గ‌జ్వేల్ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఎర్ర‌వ‌ల్లిలో త‌న ఫాంహౌస్ కోస‌మే గులాబీ ద‌ళ‌ప‌తి కాస్తో కూస్తో అభివృద్ధి ప‌నులు చేయించార‌ని.. ఇత‌ర ప్రాంతాల‌పై శీత‌క‌న్ను వేశార‌ని వారు పెద‌వి విరుస్తున్నార‌ట‌. దీంతో అక్క‌డి నుంచి ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డంపై కేసీఆర్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ని.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో.. గ‌జ్వేల్ నుంచి కాకుండా సిద్ధిపేట నుంచి పోటీ చేయాల‌ని కేసీఆర్ తొలుత భావించార‌ట‌. అయితే, అక్క‌డ హ‌రీశ్‌ ను ప‌క్క‌న పెడితే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌నే ఆందోళ‌న‌తో ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నార‌ట‌. చివ‌రకు మేడ్చ‌ల్ నుంచి బ‌రిలో దిగాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. మేడ్చ‌ల్‌ లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇప్ప‌టికే టికెట్ నిరాక‌రించ‌డం కూడా ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. మ‌రోవైపు, మేడ్చ‌ల్ నుంచి పోటీ చేసిన‌ప్ప‌టికీ కేసీఆర్ గ‌జ్వేల్‌ ను వ‌దిలేసే అవ‌కాశాలు లేవ‌ని.. బ‌హుశా ఆయ‌న రెండు చోట్ల నుంచీ బ‌రిలో దిగొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.