కేసీఆర్ ఉక్కుపాదం.. వాళ్ల కష్టాలు తీరవంతే..

Thu Jun 21 2018 11:04:44 GMT+0530 (IST)

సంపన్న రాష్ట్రానికి సేనాని అతడు.. లక్షల కోట్ల బడ్జెట్ చేతిలో ఉంది. అందరికీ వరాలు ఇచ్చేస్తున్నాడు. కానీ కొంతమంది పై మాత్రం శీతకన్ను వేస్తున్నాడు. అందుకే వారందరూ ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారు. తమకూ జీతాలు - కమిషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అడిగిన వారికి అడగని వారికి వరాలిచ్చిన దేవుడు ఇప్పుడు వారికి మాత్రం మోకాలడ్డడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తామంటే ఉక్కుపాదం మోపుతా అని ఘీంకరించిన కేసీఆర్ ఎన్నికల ముందట ఎందుకొచ్చిన రిస్క్ అని వారికి భారీగానే జీతాలు పెంచాడు. పోలీసులు - హోంగార్డులనైతే నెత్తిన పెట్టుకున్నాడు. ఉద్యోగులకు జీతాలు పెంచేశారు. దీంతో ఈ ఆశ మిగతా రంగాలపై ప్రభావం చూపింది. పర్మినెంట్ కాకుండా చాలీచాలని జీతంతో బతుకీడుస్తున్న సాక్షరభారత్ ఉద్యోగులు తమనూ పర్మినెంట్ చేసి జీతాలు చెల్లించాలని తెలంగాణలో ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 20 రోజులుగా రోజుకో తీరున నిరసన తెలుపుతున్నారు.

ఇక తాజాగా రేషన్ డీలర్ల వంతు వచ్చింది. నెల క్రితమే సమ్మెకు దిగగా.. కేసీఆర్ డీలర్ షిప్ క్యాన్సిల్ చేస్తానని బెదిరించడం.. మంత్రి ఈటెల హామీతో సమ్మెను విరమించారు. ఇప్పుడు మరోసారి సమ్మెతో సర్కారుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తహశీల్లార్ లకు సమ్మె పై వినతిపత్రం ఇచ్చారు. జూలై 1 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా రేషన్ లో కమీషన్ పెంచడం.. 30 వేల జీతం చేసి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే నెల రేషన్ సరుకుల కోసం డీడీలు కూడా కట్టలేదు. దీంతో తెలంగాణలో వచ్చే నెల రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందడం అనుమానంగా మారింది..

ఇక సర్కారు మాత్రం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా లేదు. సంస్కరణల పేరుతో రేషన్ డీలర్ల అక్రమాలను అరికట్టిన కేసీఆర్ ప్రభుత్వం మొత్తంగా డీలర్ల వ్యవస్థనే ఎత్తివేసే పనిలో ఉంది. ఇందుకోసం కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట.. ఇలా సంపన్న రాష్ట్రంలో కొన్ని వర్గాల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ సిద్ధంగా లేకపోవడం.. ఉక్కుపాదం మోపుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.