Begin typing your search above and press return to search.

స‌చివాల‌యం..అసెంబ్లీ నిర్మాణాలు ఆ కంపెనీకేనా?

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:59 AM GMT
స‌చివాల‌యం..అసెంబ్లీ నిర్మాణాలు ఆ కంపెనీకేనా?
X
న‌మ్మ‌కం ఎంత ప‌నైనా చేయిస్తుంది. ఈ మాట తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాల్ని చూస్తే ఇట్టే అర్థమ‌వుతుంది. త‌న న‌మ్మ‌కాల‌కు ఇబ్బంది క‌లిగించేలా ఉన్న అంత పెద్ద స‌చివాల‌యాన్ని నేల‌మ‌ట్టం చేయ‌ట‌మే కాదు.. అందుకోసం ఏకంగా రూ.400 కోట్ల‌తో భారీ ఎత్తున కొత్త భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌చివాల‌యం కొత్త‌దిగా ఉన్న‌ప్పుడు.. పాత అసెంబ్లీ న‌చ్చ‌దు క‌దా? అందుకే.. అసెంబ్లీని కూడా అభిరుచికి త‌గ్గ‌ట్లు మార్చుకోవాల‌ని డిసైడ్ అయ్యారు కేసీఆర్‌.

దీనికి త‌గ్గ‌ట్లే స‌చివాల‌యం.. అసెంబ్లీ నిర్మాణాలను ఏక కాలంలో పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ స‌చివాల‌య నిర్మాణానికి ఏదో ఒక ఇబ్బంది ఏర్ప‌డుతూ ప‌ని ముందుకు పోని నేప‌థ్యంలో.. తాజాగా ప‌నుల్ని ప‌రుగులు పెట్టించాల‌ని డిసైడ్ అయ్యారు.

ఇందుకోసం యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యాలు.. అనుమ‌తులు తీసుకుంటున్న కేసీఆర్‌.. తాజాగా ఈ రెండు నిర్మాణాల‌కు శంకుస్థాప‌న డేట్ ను ఈ నెల 27గా డిసైడ్ చేయ‌టంతో.. ఆ త‌ర్వాత ప‌నుల‌కు సంబంధించిన ఏర్పాట్ల దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇంత‌కీ ఈ రెండు భారీ నిర్మాణాలు ఎవ‌రు చేప‌ట్ట‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ రెండింటి నిర్మాణాల కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిల‌వాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

శంకుస్థాప‌న రోజే టెండ‌ర్ల నోటిఫికేషన్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం కేసీఆర్ సారు నివాసం ఉంటుంద‌న్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను నిర్మించిన షాపూర్ జీ- ప‌ల్లోంజీ సంస్థ‌కే రెండు నిర్మాణాల బాధ్య‌త అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను అనుకున్న స‌మ‌యానికే సిద్ధం చేయ‌టం.. నిర్మాణ ప‌రంగా ఎలాంటి లోపాలు లేక‌పోవ‌టం.. ప‌నులు సంతృప్తిక‌రంగా ఉండ‌టంతో తాజాగా రెండు నిర్మాణాల్ని ఈ సంస్థ‌కే అప్ప‌గిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఏమైనా సారు ఇంటిని నిర్మించినోళ్ల‌కు ఆ మాత్రం ప్ర‌యారిటీ ఇవ్వ‌కుండా ఉంటారా ఏంది?