Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీ పోగ్రాం మ‌రొక‌టి ఫిక్స్‌

By:  Tupaki Desk   |   28 July 2017 4:37 AM GMT
కేసీఆర్ ఢిల్లీ పోగ్రాం మ‌రొక‌టి ఫిక్స్‌
X
అంత పెద్ద కేసీఆర్‌కు బుజ్జి సూదిమందు అంటే మ‌హా చిరాక‌ని.. అస్స‌లు న‌చ్చ‌దంటూ ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం మీడియాలో వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సూదిమందు భ‌యంతోనే తాను చేయించుకోవాల్సిన కంటి ఆప‌రేష‌న్ ను ఏదో ఒక‌టి చెప్పి వాయిదా వేసుకుంటున్న‌ట్లుగా కేసీఆర్‌కు సంబంధించిన ఒక క‌థ‌నం ఆ మ‌ధ్య‌న మీడియాలో పెద్ద ఎత్తున వ‌చ్చింది. తాజాగా ఇదే విష‌యాన్ని కేసీఆర్ ను నేరుగా అడిగేశారు మీడియా ప్ర‌తినిధులు. సూదిమందు భ‌యంతోనే కంటి ఆప‌రేష‌న్ ను వాయిదా వేసుకుంటున్నారా? అన్న ప్ర‌శ్న‌ను కేసీఆర్ కు సంధించారు.

సూదిమందు అంటే త‌న‌కు భ‌యం లేద‌న్న విష‌యాన్ని నేరుగా చెప్ప‌ని కేసీఆర్‌.. చిన్న‌గా న‌వ్వుతూ.. అలాంటిదేమీ లేద‌ని తెలంగాణ సాధ‌న కోసం తాను దీక్ష చేసిన‌ప్పుడు చాలానే ఇంజెక్ష‌న్లు ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు. ప్రాణమే ఇవ్వ‌టానికి సిద్ధ‌మైన వేళ‌.. సూదిమందును ప‌ట్టించుకుంటారా? అన్న మాట ఎవ‌రి నోటా రాన‌ప్ప‌టికీ.. త‌న‌కు సూదిమందు అంటే భ‌యం లేద‌న్న మాట‌ను కేసీఆర్ చెప్పారు.

ఇదిలా ఉంటే.. వ‌రుస‌గా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్న కంటి ఆప‌రేష‌న్ విష‌యాన్ని వ‌చ్చే నెల‌లో క్లోజ్ చేయ‌నున్న‌ట్లుగా కేసీఆర్ వెల్ల‌డించారు. వ‌చ్చే నెల (ఆగ‌స్టు) 11 న ఉప రాష్ట్రప‌తిగా వెంక‌య్య‌నాయుడు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ఉంటుంద‌ని.. ఆ కార్య‌క్ర‌మానికి తాను ఢిల్లీ రానున్న‌ట్లుగా కేసీఆర్ వెల్ల‌డించారు. వెంక‌య్య‌నాయుడి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి మూడు.. నాలుగు రోజులు ముందుగా ఢిల్లీకి వ‌చ్చి ముందుగా ఆప‌రేష‌న్ చేయించుకుంటాని.. ఆ త‌ర్వాత ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్న‌ట్లు చెప్పారు.

ఇక‌.. హైద‌రాబాద్ కు మ‌ణిహారం లాంటి మెట్రో రైలు ప్రారంభం మీద కొంత‌కాలంగా కొన‌సాగుతున్న‌క‌న్ ఫ్యూజ‌న్‌కు కేసీఆర్ తెర దించేశారు. మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో మెట్రో రైల్ ప‌ట్టాల మీద‌కు ఎక్క‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మెట్రో రైల్ ప్రారంభంలో భాగంగా తొలుత మియాపూర్ - ఎల్‌బీ న‌గ‌ర్ లైన్ లోని మియాపూర్ - ఎస్ ఆర్ న‌గ‌ర్ వ‌ర‌కూ.. నాగోల్ - మెట్టుగూడ వ‌ర‌కూ మెట్రో స‌ర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు.

కొద్దిపాటి దూరాల‌కు మెట్రోను మొద‌లు పెడితే ఉప‌యోగం ఉండ‌ద‌న్న ఉద్దేశంతో ఇంత‌కాలంగా ఆగామ‌ని.. అందుకే ఏదో ఒక లైన్ పూర్తిస్థాయిలో పూర్తి అయ్యాక మెట్రోను మొద‌లు పెట్టాల‌ని అనుకున్నామ‌ని.. మియాపూర్ - ఎస్ ఆర్ న‌గ‌ర్ వ‌ర‌కూ లైన్ పూర్తి అయ్యింద‌ని.. మూడు నెల‌ల్లో మెట్రో ప‌ట్టాల మీద ప‌రుగులు తీయ‌టం ఖాయ‌మ‌ని తీపి క‌బురు చెప్పారు. చూస్తుంటే.. ద‌స‌రాకు మెట్రో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెప్పొచ్చు.