Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్యాబినెట్‌..ఓ లిమిటెడ్ ఎడిష‌న్‌

By:  Tupaki Desk   |   17 Dec 2018 4:42 AM GMT
కేసీఆర్ క్యాబినెట్‌..ఓ లిమిటెడ్ ఎడిష‌న్‌
X
గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు త‌న కొత్త క్యాబినెట్‌ పై త‌న మార్క్ ట్విస్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ముఖ్య‌మంత్రి అయింది మొద‌లుకొని ప‌రిపాలనపై దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ ఈ క్ర‌మంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు అంత ప్రాధాన్యం ఇవ్వ‌డంలేద‌ని అంటున్నారు. లిమిటెడ్ ఎడిష‌న్ క్యాబినెట్‌ తో ఆయ‌న ముందుకు సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే, స‌ద‌రు మంత్రివ‌ర్గం కూడా వెనువెంట‌నే కాకుండా ఈనెలాఖ‌రులో ఉంటున్న‌ద‌ని పేర్కొంటున్నారు.

ఈ నెల 21 నుంచి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రాష్ట్రపతి వచ్చి వెళ్లే కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హడావుడి ముగిసిన తర్వాత నెలాఖరులో అసెంబ్లీ తొలి సెషన్ నిర్వహించాలని - అప్పుడే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి విడతలో 6 నుంచి 8 మందిని మంత్రులుగా తీసుకొని - పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. వ్యక్తులు, ఇతర రాజకీయ సమీకరణాల కోసం కాకుండా...ప్రభుత్వ ప్రాథమ్యాలు - ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సుపరిపాలన అందించేలా మంత్రులను నియమించే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగానే సహచరులను నియమించుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి మొహమాటానికి పోవద్దని సీఎం కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు అధికారుల నియామకంపైనా సీఎం కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయాల్సి ఉన్నందున నిబద్ధత - పనితీరు ఆధారంగానే ఆయా శాఖలకు ముఖ్య అధికారులను నియమించనున్నారు.

స్థూలంగా - రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే మంత్రివర్గ విస్తరణకు మరో పది నుంచి పదిహేను రోజులు పట్టడం ఖాయ‌మంటున్నారు. సోమవారం నాడు టీఆర్ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా కె.తారకరామారావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఒకటెండ్రు రోజుల్లో ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు వెళ్లనున్నారు. మరోవైపు 21వ తేదీ నుంచి హైదరాబాద్‌ లో రాష్ట్రపతి రామ్‌ నాధ్‌ కోవింద్‌ శీతాకాల విడిదికి రానున్నారు. దీంతో రాష్ట్రపతి ఉన్నన్ని రోజులూ ఆయన వెంటనే కేసీఆర్‌ ఉండాల్సిన పరిస్థితి. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయే సరికి పది నుంచి పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.