కేబినెట్ ముహూర్తం ఖారారు.. వీరు డౌటే

Sat Feb 09 2019 12:20:50 GMT+0530 (IST)

తెలంగాణ కేబినెట్ పై సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కొద్దిరోజులుగా తెలంగాణ ప్రజలు మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మంత్రి పదవుల కేటాయింపుపై కేసీఆర్ తుదిరూపుకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ - హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ఇప్పుడు కేబినెట్ లో ఉండడంతో వివిధ శాఖలు ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో కేబినెట్ విస్తరణకు కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.ఈసారి కొత్త వారికే ఎక్కువ మంత్రి పదవులు అన్న ఊహాగానాలు వ్యక్తమైనప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం పాత కొత్తల మిశ్రమంగా కేబినెట్ విస్తరిస్తున్నట్టు సమాచారం. గతంలో పనిచేసిన మంత్రులందరికీ మళ్లీ కెబినెట్ బెర్త్ దక్కుతోందని సమాచారం. తొలివిడత కేబినెట్ విస్తరణలో ఇద్దరు - ముగ్గురు కొత్త వారికి అవకాశం ఉండవచ్చన్న అంచనాలున్నాయి. ప్రధానంగా పలువురు సీనియర్లకు విస్తరణలో మొండిచెయ్యి చూపనున్నారనే వార్త వెలువడుతోంది.

కేసీఆర్ మేనల్లుడు హరీష్ - తనయుడు కేటీఆర్ కు తొలి విస్తరణలో మంత్రి పదవులు దక్కడం డౌటే అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొత్తంగా తొలి విస్తరణలో 10మంది మంత్రులకు చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. తుది జాబితాపై కేసీఆర్ కసరత్తు పూర్తయ్యిందని.. 10న వసంత పంచమి సందర్భంగా కేబినెట్ విస్తరణ ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం.