Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో ముస‌లం పుట్టిందా?

By:  Tupaki Desk   |   21 April 2017 4:23 AM GMT
టీఆర్ ఎస్‌ లో ముస‌లం పుట్టిందా?
X
కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డ్డ తెలంగాణ‌లో తొలి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ ఎస్‌) అప్ర‌హ‌తిహాతంగా ముందుకు దూసుకెళుతోంది. సుదీర్ఘ‌కాలం పాటు సీఎంలుగా అనుభ‌వ‌మున్న వారికి సాధ్యం కాని ప‌నుల‌ను కూడా కేసీఆర్ చేస్తూ త‌న‌కు తానే సాటి అని నిరూపిస్తున్నారు. పాల‌నా ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగానూ కేసీఆర్ వేసే ప్ర‌తి అడుగు కూడా ప‌క్కా ప్లాన్‌తో వేస్తున్న‌దేన‌న్న విశ్లేష‌ణ‌లు కూడా సాగుతున్నాయి. అస‌లు తెలంగాణ‌లో విప‌క్ష‌మ‌న్న‌దే లేకుండా చూడాల‌న్న క‌సితో ముందుకు సాగుతున్న కేసీఆర్‌... టీడీపీని చావు దెబ్బ కొట్టేశారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కూడా కేసీఆర్‌ కు ఎదురొడ్డి నిల‌బ‌డే ప‌రిస్థితి స‌మీప భ‌విష్య‌త్తులో క‌నిపించ‌డం లేదు. ఇలాంటి కీల‌క త‌రుణంలో టీఆర్ ఎస్‌ లో ముసలం అంటే కాస్తంత ఆలోచించాల్సిన విష‌య‌మే.

ఎందుకంటే... పార్టీని, ప్ర‌భుత్వాన్ని సింగిల్ హ్యాండ్‌ తో నెట్టుకు వ‌స్తున్న కేసీఆర్ ఉండ‌గా... టీఆర్ ఎస్‌ లో ముస‌ల‌మ‌న్న మాటే లేదు. అలాంటిది ఇప్పుడు టీఆర్ ఎస్‌ లో ముస‌లం అంటేనే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. అది కూడా కేసీఆర్ ఆల్లుడిగా ఉన్న ఓ కీల‌క నేత నోట నుంచి ఈ మాట విన‌ప‌డటం మ‌రింత విడ్డూర‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే కేసీఆర్ అల్లుడంటే... ఒక్క త‌న్నీరు హ‌రీశ్ రావే మ‌న‌కు గుర్తుకు వ‌స్తారు. కేసీఆర్ కేబినెట్‌ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న హ‌రీశ్ రావు... మామ‌కు త‌గ్గ అల్లుడ‌ని అనిపించుకున్నారు. మామ ఖాళీ చేసిన సిద్దిపేట‌లో మామ కంటే కూడా అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం సాధించిన రికార్డు హ‌రీశ్ రావు సొంతం. అలాంటిది హ‌రీశ్ రావు నోట... టీఆర్ ఎస్‌ లో ముస‌లం అనే మాట వినిపిస్తుందా? అంటే.. ఎంత‌మాత్రం కాద‌నే అంటారు అంతా.

మ‌రి కేసీఆర్ అల్లుడి నోట టీఆర్ ఎస్ లో ముస‌లం మాట ఎలా విన‌ప‌డింద‌నేగా మీ డౌటు? అక్క‌డికే వ‌స్తున్నాం. హ‌రీశ్ రావుతో పాటు ఉమేశ్ రావు అనే ఓ వ్య‌క్తి కూడా కేసీఆర్‌ కు అల్లుడ‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందేగా. ఆ అల్లుడి నోట నుంచే ఇప్పుడు టీఆర్ ఎస్‌ లో ముస‌లం అనే మాట విన‌ప‌డింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌టానికి కాస్తంత ముందు వ‌ర‌కు కేసీఆర్ వ‌ద్దే ఉన్న ఉమేశ్ రావు.. ఆ త‌ర్వాత మామ‌తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ అల్లుడి హోదాలో త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఉమేశ్ రావును కాంగ్రెస్ పార్టీ నేత‌లు బాగానే చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం టీ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా ఉమేశ్ రావు కొన‌సాగుతున్నారు.

నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన ఉమేశ్ రావు... టీఆర్ ఎస్‌ - హ‌రీశ్ రావు గురించి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. టీఆర్‌ ఎస్‌ పార్టీలో ముసలం పుట్టిందని, మంత్రి హరీశ్‌ రావును ఆ పార్టీలో పక్కనపెట్టారని ఆయ‌న ఓ బాంబు పేల్చారు. హరీశ్‌ రావును పనిమంతుడి కితాబిచ్చిన ఉమేశ్‌... అలాంటి వాడు కాంగ్రెస్‌ లోకి వస్తే బావుంటుందని త‌న మ‌న‌సులోని మాట చెప్పేశారు. హరీశ్‌ రావు కూడా అవమానాలను భరిస్తూ టీఆర్‌ ఎస్‌ లో కొనసాగాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్సే హరీశ్‌ రావుకు సరైన పార్టీ అని కూడా ఉమేశ్ పేర్కొన్నారు. హరీశ్‌ వస్తే కాంగ్రెస్‌ పార్టీకి సైతం లాభం కలుగుతుందని, ఆయనను కాంగ్రెస్‌ లోకి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని కూడా ఉమేశ్ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/