Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరిక‌ను తీర్చలేన‌ని చెప్పేసిన మోడీ

By:  Tupaki Desk   |   26 July 2017 1:53 PM GMT
కేసీఆర్ కోరిక‌ను తీర్చలేన‌ని చెప్పేసిన మోడీ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిరకాల వాంచ‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బ్రేకులు వేశారు. సుదీర్ఘంగా ప్ర‌య‌త్నిస్తూ..జంప్ జిలానీ కూడా ప్రోత్స‌హిస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్‌ కు ఆయ‌న స‌మ‌క్షంలోనే షాక్ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ బుధవారం మధ్యాహ్నం ప్రధానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సంఖ్యను పెంచే అవకాశం లేదని కేసీఆర్‌ కు మోడీ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రధానితో భేటీ అనంతరం వెలుపలికి వచ్చిన సీఎం కేసీఆర్‌ అక్కడ ఉన్న పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు. పలు అంశాలపై జరిగిన చర్చల గురించి కేసీఆర్‌ వివరిస్తూ అసెంబ్లీ సీట్ల విషయంలో సైతం ప్రధాని మోడీ ఆయన అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారని తెలిపారు. ప్రస్తుతానికి సీట్ల సంఖ్య పెరిగే అవకాశంలేదని స్పష్టమైందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి సంబంధించి ప్రధానమైన ఆరు అంశాలను ప్రధానితో చర్చించామని, ఇందులో అసెంబ్లీ సీట్ల అంశాన్ని చిట్టచివరిదిగా పెట్టుకున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దీన్ని బట్టి ఈ అంశానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పునర్ వ్య‌వస్థీకరణ చట్టంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని స్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయం, దానికి కొనసాగింపుగా కొంత లీగల్‌ ప్రక్రియ అవసరమని అన్నారు. కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తూ ఉందో కొంతకాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలే స్పష్టంచేస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీకి పెరిగితే తెలంగాణకు కూడా పెరుగుతాయంటూ కేసీఆర్‌ తనదైన శైలిలో ఒక సామెతను ఉటంకించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కంటే ముఖ్యమైన అంశాలు తెలంగాణలో చాలా ఉన్నాయన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలుచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది కాబట్టి అందులోని అసెంబ్లీ సీట్ల అంశాన్ని కూడా కేంద్రం దగ్గర ప్రస్తావించాం తప్ప ఇదే తొలి ప్రాధాన్యం కలిగినదిగా భావించడంలేదని చెప్పారు. చివరకు సీట్లు పెరుగుతాయా లేదా? అని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా, ‘గో వితౌట్‌ సేయింగ్‌’ అంటూ పెరిగే అవకాశం లేదని, పెరుగడం అనుమానమేననే తీరులో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సీట్లు పెరిగినా పెరుగకపోయినా పెద్దగా పడే ప్రభావం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి ముసాయిదా బిల్లు, కేంద్ర క్యాబినెట్‌ లో చర్చించడానికి నోట్‌ సిద్ధమైనా రాజకీయ నిర్ణయం రాకపోవడంతో ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం అయిన సందర్భంగా కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే.. రాజకీయ నిర్ణయం జరిగితే బిల్లు పెట్టడానికి తమకు అభ్యంతరం లేదని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ నిర్ణయాన్ని ప్రధాని మోదీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తీసుకోవాల్సిందేనని చంద్రబాబుకు కేంద్రమంత్రి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ - ప్రధాని మోదీల మధ్య భేటీ సందర్భంగా ఇప్పటికి సీట్లను పెంచే ఉద్దేశం లేదన్న సంకేతం రావడం అన్ని అనుమానాలకు తెర దించింది. ఏడాదికాలంగా తీవ్రంగా నలుగుతున్న ఈ అంశంలో కేంద్రం ఒక మేరకు సానుకూలంగానే ఉన్నా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర వైఖరిలో కొంత మార్పు కనిపించింది. ఆ తర్వాత తెలంగాణ - ఏపీ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటించడం, ఆ సందర్భంగా రెండు రాష్ట్రాల బీజేపీ శాఖలు సీట్ల సంఖ్య పెంచడం అధికార పార్టీలకే లాభం చేకూరుస్తుంది తప్ప బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేదని, అందువల్ల పెంచవద్దని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే సీట్ల సంఖ్యను పెంచడానికి అవకాశమే లేదని మోదీ - రాజ్‌ నాథ్‌ సింగ్‌ మాటల ద్వారా స్పష్టమైంది.