Begin typing your search above and press return to search.

వెంక‌న్నకు మొక్కు చెల్లించేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   22 Feb 2017 5:10 AM GMT
వెంక‌న్నకు మొక్కు చెల్లించేసిన కేసీఆర్‌
X
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డితే... ఆయా దేవుళ్ల‌కు మొక్కుకున్న మొక్కుల‌ను కేసీఆర్ తీర్చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లు ఆల‌యాల‌కు మొక్కులు చెల్లించేసిన కేసీఆర్‌... తాజాగా ఏపీలోని తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామికి మొక్కు తీర్చుకున్నారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌విస్తే... తిరుమ‌ల వెంక‌న్న‌కు సాలిగ్రామ హారంతో పాటు కంఠాభ‌ర‌ణాల‌ను స‌మ‌ర్పిస్తాన‌ని కేసీఆర్ మొక్కుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో నాలుగు నెల‌ల క్రిత‌మే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) అధికారుల‌కు త‌న మొక్కు చెల్లించే విష‌యాన్ని చెప్పారు. దీంతో స్పందించిన టీటీడీ అధికారులు... కేసీఆర్ అభీష్టం మేర‌కు చెన్నైకి చెందిన బంగారు ఆభ‌ర‌ణాల త‌యారీదారుల‌ను పిలిపించి.... ఆభ‌ర‌ణాలు చేయించారు.

రెండు నెలల క్రిత‌మే కేసీఆర్ ఈ ఆభ‌ర‌ణాల‌న‌ను స్వామివారికి అందజేయాల్సి ఉన్నా... ప‌లు కార‌ణాల‌తో ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు మూడో ప‌ర్యాయం ఆయ‌న ప‌ర్య‌ట‌న ఖ‌రారు కాగా... నిన్న సాయంత్రం కుటుంబ స‌భ్యులు, త‌న కేబినెట్‌ లోని మంత్రులు - ఇత‌ర అధికారుల‌తో కూడా భారీ బృందంతో క‌లిసి కేసీఆర్‌ తిరుమ‌ల చేరుకున్నారు. నిన్న రాత్రి వెంక‌న్న కొండ‌పైనే బ‌స చేసిన కేసీఆర్‌... నేటి ఉద‌యం స‌తీమ‌ణి శోభ‌తో క‌లిసి ఆయ‌న స్వామివారిని ద‌ర్శించుకున్నారు. మ‌హాద్వారం ద్వారా ఆల‌యంలోకి ప్ర‌వేశించిన కేసీఆర్ దంప‌తులు తెలంగాణ ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో చేయించిన 14 కిలోల బ‌రువున్న స్వ‌ర్ణ సాలిగ్రామ హారం - 4.65 కిలోల బ‌రువున్న కంఠాభ‌ర‌ణాల‌ను స్వామివారి పాదాల చెంత ఉంచారు. ఈ ఆభ‌ర‌ణాల ఖ‌రీదు మొత్తం రూ.4.91 కోట్లని తేలింది.

సాలిగ్రామ హారం కోసం రూ.3.7 కోట్లు ఖ‌ర్చు చేసిన కేసీఆర్‌... కంఠ‌భ‌ర‌ణాల కోసం రూ.1.21 కోట్ల‌ను ఖ‌ర్చు చేశారు. దీంతో ఈ రెండు ఆభ‌ర‌ణాల మొత్తం విలువ రూ.4.91 కోట్లుగా తేలింది. ఇక వెంక‌న్న మొక్కు తీర్చుకునేందుకు తిరుమ‌ల వ‌చ్చిన కేసీఆర్ వెంట ఆయ‌న కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌ - మేన‌ల్లుడు - త‌న కేబినెట్‌ లోని కీల‌క మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు - మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి - ఈట‌ల రాజేంద‌ర్‌ - తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి త‌దిత‌రులు కూడా ఉన్నారు. ఇక కేసీఆర్ బంధువ‌ర్గంలోని ప‌లువురు కూడా తిరుమ‌ల‌కు చేరుకున్నారు. పొరుగు రాష్ట్ర సీఎంగా హోదాలో స్వామి వారికి కోట్లాది రూపాయ‌ల విలువ చేసే ఆభ‌ర‌ణాల‌ను స‌మ‌ర్పించేందుకు వ‌చ్చిన కేసీఆర్ అండ్ కోకు టీటీడీ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

నేటి ఉద‌యం విడిది నుంచి కేసీఆర్ దంప‌తుల‌ను అధికారులు బ్యాట‌రీ వాహ‌నంలో ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మ‌హాద్వారం నుంచి ఆల‌యంలోకి ప్ర‌వేశించిన కేసీఆర్‌... మొక్కు తీర్చుకున్న త‌ర్వాత ఆల‌యం వెలుప‌ల‌కు వ‌చ్చి మీడియాతోనూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం త‌ర‌ఫున స్వామి వారికి మొక్కులు చెల్లించాం. తెలుగు ప్ర‌జ‌ల‌ను చ‌ల్ల‌గా చూడాల‌ని స్వామి వారిని వేడుకున్నా. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాల‌ని కోరుకున్నా. తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్ర‌గ్రామి రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలి. ఇరు రాష్ట్రాల‌ మ‌ధ్య ఉన్న అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/