Begin typing your search above and press return to search.

కేసీఆర్ సమర్పించు కొత్త జిల్లాలు.. కొత్త మండలాలు

By:  Tupaki Desk   |   6 May 2016 7:03 AM GMT
కేసీఆర్ సమర్పించు కొత్త జిల్లాలు.. కొత్త మండలాలు
X
వ్యూహాలు పన్నటంలోనే కాదు.. దూరదృష్టితో ఆలోచించే విషయంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అందులో చాలానే కోణాలు ఉంటాయి. నిత్యం ఏదో ఒక కొత్త అంశానికి సంబంధించిన ప్రకటన వెలువడేలా చేయటం ద్వారా.. ప్రభుత్వం ఎంతో చైతన్యంతో పని చేస్తుందని.. తెలంగాణను మొత్తంగా మార్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్న భావన కలగటం ఖాయం. వాస్తవంలో అలాంటిది ఎంత నిజమన్న విషయాన్ని పక్కనపెడితే.. ఏదోజరుగుతుందన్న హడావుడి చేయటంలో కేసీఆర్ అండ్ కో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

అలా అని ఏదో మాటలతో కాకుండా.. చేతలతో కూడా ఎంతోకొంత ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవం. కాకుంటే.. మాటల హడావుడితో పోలిస్తే జరుగుతున్న పనులు తక్కువన్నదే విమర్శ. మొన్నటికి మొన్న లుంబినీ పార్కు దగ్గర భారీగా అమరవీరు స్థూపాన్ని ఏర్పాటు చేయాలని.. భారీ జాతీయ జెండాను జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావదినోత్సవాల్లో ప్రదర్శించాలన్న నిర్ణయాల కొత్తదనం పోకముందే మరో కొంగొత్త విషయానికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న మాటను తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నదే. మొదట్లోఈ విషయం మీద కాస్త హడావుడి చేసిన కేసీఆర్.. కొద్దిరోజులుగా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తాజాగా ఆయన కొత్త జిల్లాలకు సంబంధించి కొన్ని నిర్ణయాల్ని తీసేసుకోవటం గమనార్హం. ఇప్పటివరకూ ఉన్నపది జిల్లాల స్థానే మరో 14 నుంచి 15 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన జూన్ 2న ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. దసరా లోపే ఈ కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని కేసీఆరే స్వయంగా చెప్పటం గమనార్హం. ఇప్పుడున్న జిల్లాలకు కొత్తగా వచ్చే 14.. 15 జిల్లాలు మాత్రమే కాదు మరో 40 కొత్త మండలాల్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు.

కొత్త అంటే మహా మోజు ప్రదర్శించే కేసీఆర్.. కొత్త జిల్లాలు.. మండలాల పెంపు విషయంలో ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారంటే దీని వెనుక.. రాజకీయ.. ఆర్థిక అంశాలు ఉండటమే. వివిధ పార్టీల నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు అవకాశాలు కల్పించేలా చేయటంతో పాటు.. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో పెరిగే అసెంబ్లీ స్థానాలకు తగ్గట్లుగా జిల్లాల్ని రూపొందించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. పెరిగే జిల్లాలు.. పెరిగే అసెంబ్లీ స్థానాల నేపథ్యంలో పార్టీ బలాన్ని మరింత పెంచటంతో పాటు.. మరిన్ని జిల్లాలతో పదవులు సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఇదో కోణమైతే.. మరో కీలక అంశం కూడా ఉంది.

కేంద్రం చేపట్టే పలు పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు లాంటి వాటి ఎంపికను జిల్లాల వారీగా ఎంపిక చేయటం.. నిధుల విడుదల కోసం జిల్లాల వారీగా యూనిట్లను తీసుకునే తీరు పెరగనున్న జిల్లాల వల్ల లబ్థి చేకూరటం ఖాయంగా చెప్పొచ్చు. వీటన్నింటికి తోడు.. జిల్లాలు పెరిగిన నేపథ్యంలో జిల్లా ప్రధాన పట్టణాలు మరింత వృద్ధి చెందటం.. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావటం జరుగుతుంది. ఇవే కాకుండా పాలనా సౌలభ్యం కూడా ఉండే వీలుంది. పదవుల పంపకంతో పాటు.. ప్రజలకు పాలనా పరమైన అంశాల్లో ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా చేయటంలోనూ కొత్త జిల్లాలు సాయం చేస్తాయని చెప్పక తప్పదు.