Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎం వ‌ర్సెస్ యూపీ సీఎం

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:13 PM GMT
తెలంగాణ సీఎం వ‌ర్సెస్ యూపీ సీఎం
X
ఎన్నిక‌ల ర‌ణ‌రంగం మొద‌ల‌య్యాక... ఆప‌ద్ధర్మ ముఖ్య‌మంత్రి అయినా ఇత‌ర రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా ఒక‌టే... ఎన్నిక‌ల సంఘానిదే పెద్ద‌రికం. నాయ‌కుల‌పై గ‌వ‌ర్న‌మెంటుదే పైచేయి. ముఖ్య‌మంత్రులు అయినా క్యూ క‌ట్టాల్సిందే. తాజాగా తాండూరులో ఇలాంటి సంఘ‌ట‌నే ఎదుర‌వుతోంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాండూరులో బీజేపీ - టీఆర్ ఎస్ పార్టీ త‌మ ముఖ్య‌నేత‌ల స‌భ‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు మ‌హామ‌హుల‌ను పిలుచుకుంటున్న‌ట్లే బీజేపీ కూడా హిందూ సీఎంగా ముద్ర‌ప‌డిన యోగి ఆదిత్య‌నాథ్‌ ను ప్ర‌చారానికి ఆహ్వానించింది. ఆయ‌న స‌రే అన్నారు. దీంతో బీజేపీ తాండూరు ప్ర‌భుత్వ క‌ళాశాల మైదానం అద్దెకు కావాల‌ని అడిగారు. ఈ మేరకు ద‌ర‌ఖాస్తు చేశారు. ఇందులో పెద్ద విశేష‌మేమీ లేదు గాని అదే మైదానం కావాల‌ని టీఆర్ ఎస్ పార్టీ నుంచి కూడా ద‌ర‌ఖాస్తు వ‌చ్చింద‌ట‌. ట్విస్ట్ ఏంటంటే... ఆ ఇద్ద‌రు సీఎంలు ఒకే తేదీన‌ గ్రౌండ్ కావాల‌ని అడుగుతున్నారు.

అయితే, ఈనెల 16వ తేదీన బీజేపీ నాయ‌కులు ఆ గ్రౌండ్‌ లో స‌భకు అనుమ‌తి తీసుకున్నారు. ఇప్ప‌టికే షెడ్యూల్ కూడా ప్రిపేర‌య్యింది. ఇంత‌లో టీఆర్ ఎస్ నుంచి కూడా ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. ఇద్దరి స‌భ‌లు ఈనెల 25 వ తేదీనే తాండూరులో జ‌ర‌గ‌నున్నాయి. సీఎం పాల్గొనే స‌భ అంటే... ఆషామాషీ కాదు. పార్కింగ్‌ తో పాటు జ‌నానికి స్థ‌లం కావాలంటే.. ఒకే రోజు అసంభ‌వం. ఆ గ్రౌండ్‌ లో మూడు రోజుల ముందు ఏర్పాట్లు చేస్తే గాని కుద‌ర‌దు. మ‌రి ఇద్ద‌రు క‌లిసి ఏర్పాట్ల ఖ‌ర్చు భ‌రిస్తారా అనుకోవ‌డానికీ లేదు. ఎందుకంటే రెండు పార్టీల జెండాలు - క‌టౌట్లు వేరు. వాటిని ఒక్క రోజులో ఏర్పాటుచేయ‌డం సాధ్యం కాదు. అందుక‌నే ఏదో ఒక స‌భ‌ ర‌ద్దు అవుతుందేమో అంటున్నారు.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఇద్ద‌రు సీఎంల‌కు భద్రతాపరమైన అనుమతులు లభించ‌క‌పోవ‌చ్చు కూడా. సాధార‌ణంగా ఇట్లాంటి సంద‌ర్భాల‌ను అవాయిడ్ చేయ‌డానికే అధికారులు ప్ర‌య‌త్నిస్తుంటారు. బ‌హుశా బీజేపీ ముందు అనుమ‌తి తీసుకుంది కాబ‌ట్టి టీఆర్ ఎస్ స‌భా స్థ‌లి మారొచ్చు. లేదా ఎంత‌యిన‌ తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ సీఎం కాబ‌ట్టి బీజేపీ వాళ్లే మార్చుకోవ‌చ్చు. ఏదో ఒక‌టినా? రెండూ జ‌రుగుతాయా అన్న డైల‌మాలో ఉన్నారు స్థానికులు.