Begin typing your search above and press return to search.

ఇందుకే కేసీఆర్ ఎవ‌ర్నీ క‌ల‌వ‌డం లేదట‌

By:  Tupaki Desk   |   17 Oct 2018 6:07 PM GMT
ఇందుకే కేసీఆర్ ఎవ‌ర్నీ క‌ల‌వ‌డం లేదట‌
X
అదేదో సినిమాలో చెప్పిన‌ట్లు భ‌యంతో కూడిన భ‌క్తి వ‌ల్ల క‌లిగిన చ‌ర్య కావ‌చ్చు అన్న‌ట్లుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలిపై ఉంద‌ని సోష‌ల్ మీడియాలో కొంద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రేంజ్‌లో కేసీఆర్‌పై కామెంట్లు చేసేందుకు గ‌ల కార‌ణం....టీఆర్ఎస్ పార్టీలో నెల‌కొన్న అసంతృప్తులు, వాటిని కేసీఆర్ హ్యాండిల్ చేస్తున్న తీరు. ఈ క్ర‌మంలో చోటు చేసుకంటున్న ప‌రిణామాలు!

అనూహ్య రీతిలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే ఈ సంద‌ర్భంగానే రికార్డ్ స్థాయిలో 105 మంది అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగానే మొద‌లైన అల‌క‌లు అనంత‌రం అసంతృప్తికి, ఆ త‌దుప‌రి తిరుగుబాటుకు దారితీశాయి. ఆ వెంట‌నే కొంద‌రిపై స‌స్పెన్ష‌న్ వేటు కూడా ప‌డింది. ఇందులో పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడిగా ఉన్న రాములునాయ‌క్ లాంటి ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఉన్నారు. ఈ ప‌రిణామం స‌హ‌జంగానే సంచ‌ల‌నం క‌లిగించింది. పరిస్థితి ఈ విధంగా ఉన్న సమయంలోనే హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపాయి. 'నాకుగాని, నా అల్లుడికిగానీ ముషీరాబాద్‌ టికెట్‌ ఇవ్వాలంటూ కోరా. కానీ కేసీఆర్‌ తిరస్కరించారు. ఎల్‌బీ నగర్‌ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానంటూ సీఎం మాకు చెప్పారు. ఈ విషయంపై చర్చించేందుకు కనీసం మాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వటం లేదు...' అంటూ ఆయన మీడియా సాక్షిగా నిరసన గళం విప్పిన సంగతి విదితమే.

పార్టీలో ముఖ్యుడు, సాక్షాత్తు హోంమంత్రి చేసిన‌ వ్యాఖ్యలు టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టగా.. ప్రతిపక్షాలకు మంచి అస్త్రంగా మారాయి. దీంతో సహ‌జంగానే ర‌చ్చ ర‌చ్చ అయింది. అయినా కేసీఆర్ ఏమాత్రం స్పందించ‌లేదు. స‌రిక‌దా స‌ద‌రు అసంతృప్తుల‌ను క‌ల‌వ‌లేదు. ఈ ప‌రిణామం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు ఎందుకు కేసీఆర్ ఎవ‌రితోనూ మాట్లాడ‌టం లేద‌నే ప్ర‌శ్న తెర‌మీద‌కు వ‌చ్చింది. దీనికి టీఆర్ఎస్ వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర రిప్లై ఇస్తున్నాయి. `ఒక‌రితో మాట్లాడితే మ‌రొక‌రు త‌మ డిమాండ్‌ను తెర‌మీద‌కు తెస్తారు. ఇది ఇలాగే కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో అసంతృప్తులు చల్లారిన తర్వాత ఒక్కొక్కరితో మాట్లాడదామని ఆయన భావిస్తున్నారు. అందుకే అప్పటిదాకా ఎవ్వర్నీ కలవొద్దని నిర్ణయించుకున్నారు.`అని గులాబీ ద‌ళ‌ప‌తి మ‌న‌సు ఎరిగిన వారు చెప్తున్నారు.