Begin typing your search above and press return to search.

జగన్ - కేసీఆర్ 4 నెలల్లో నాలుగో మీటింగ్..అజెండా మోదీయేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2019 3:47 PM GMT
జగన్ - కేసీఆర్ 4 నెలల్లో నాలుగో మీటింగ్..అజెండా మోదీయేనా?
X
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్‌ లు మరోసారి కలవబోతున్నారు. సెప్టెంబరు 24న వారిద్దరూ హైదరాబాద్‌ లో భేటీ కాబోతున్నారు. నదుల అనుసంధానంపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ అందజేసిన ప్రతిపాదనలపై వారు చర్చిస్తారని తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ఇదివరకే వీరు మూడు సార్లు భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. గవర్నర్ సమక్షంలో విభజన అంశాలను పరిష్కరించుకోవాలని గతంలో జరిగిన భేటీలో నిర్ణయించారు. అయితే గవర్నర్ నరసింహన్ స్థానంలో కొత్త గవర్నర్ తమిళిసై నియామకం కావడంతో అప్పుడు జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. పైగా తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఇరు రాష్ట్రాల మధ్య తిరిగి భేటీ కుదరలేదు.

ప్రస్తుతం తొమ్మిది - పది షెడ్యూలు సంస్థల విభజన - గోదావరి - కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆర్థికపరమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సీఎంలిద్దరూ కేంద్రంతో ఎలా వ్యవహరించాలనే విషయంలోనూ ఒక ఆలోచనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంలపై రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. దీనిపై ఎలా ముందుకు వెళితే బాగుంటుందన్నది చర్చించనున్నట్లు సమాచారం. అదేసమయంలో మమతా బెనర్జీ వంటివారు మోదీకి సరెండర్ అయిపోవడంతో కేసీఆర్ కూడా సరెండర్ కావడానికే నిర్ణయించుకున్నారని... ఇప్పటికే మోదీ - అమిత్ షాల ముందు సాగిలపడిన జగన్ ద్వారా రాయబారం నెరిపే ఆలోచన ఉందని వినిపిస్తోంది.