Begin typing your search above and press return to search.

ఢిల్లీ కేసీఆర్ వ‌రుస భేటీలు..తిరుగుటపాలో బాబు

By:  Tupaki Desk   |   25 July 2017 4:04 PM GMT
ఢిల్లీ కేసీఆర్ వ‌రుస భేటీలు..తిరుగుటపాలో బాబు
X
రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం సంద‌ర్భంగా తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఢిల్లీ టూర్ ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌థ‌మ పౌరుడి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అనంత‌రం ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు. అయితే ప‌లువురు మంత్రుల‌తో స‌మావేశం అయిన అనంత‌రం ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒకేరోజు తిరుగుట‌పాతో విజ‌య‌వాడకు వ‌చ్చేయ‌డం...తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మ‌కాం వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్డీఏ భాగ‌స్వామ్యప‌క్ష పార్టీ నేత‌గా ఉన్న చంద్ర‌బాబు త‌న రాష్ర్టానికి తిరిగి ప్ర‌యాణం చేస్తుండ‌టం - అదే స‌మ‌యంలో ప‌లువురు కేంద్ర మంత్రులు కేసీఆర్‌ కు అపాయింట్ ఇవ్వ‌డంపై రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న అనంత‌రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ - ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ - పెట్రోలియం మంత్రి ధర్మేంధ్రప్రదాన్‌ తో చంద్ర‌బాబు స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశాల సంద‌ర్భంగా పోలీస్‌ శాఖకు సంబంధించిన అంశాలు - రెవెన్యూ లోటు భర్తీ - పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు - కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని వెంటనే అమలులోకి తీసుకోచ్చే అంశం - సెంట్రల్ - ట్రైబల్ వర్సిటీలకు నిధులు - ఏపీకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు - గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు నిధుల మంజూరు - కాకినాడ‌లో పెట్రోలియం కారిడార్ వంటి అంశాల‌ను సంబంధిత మంత్రుల‌తో చ‌ర్చించారు. అనంత‌రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి విజయవాడకు బయల్దేరారు.

కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఎంపీలు జితేందర్‌ రెడ్డి - వినోద్ - ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ - డీజీపీ అనురాగ్ శర్మ ఉన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని హోంమంత్రిని సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. బుధ‌వారం వ‌ర‌కు ఢిల్లీలోనే ఉండ‌నున్న సీఎం కేసీఆర్‌...ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతోపాటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ - జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలువనున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు రాష్ట్రానికి చెందిన కీలకమైన అంశాలపై వారితో చర్చించే అవశాశం ఉంద‌ని తెలుస్తోంది.