Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు చంద్రుళ్ల కోపం న‌శాళానికి అంటింది

By:  Tupaki Desk   |   26 July 2017 5:15 AM GMT
ఇద్ద‌రు చంద్రుళ్ల కోపం న‌శాళానికి అంటింది
X
కోటి అశ‌లు పెట్టుకున్న అసెంబ్లీ సీట్ల పెంపుపై తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు మింగుడుప‌డ‌నిది మారింది. మ‌రికొద్ది రోజుల్లో తాము కోరుకున్న సీట్ల పెంపు ముచ్చ‌ట పూర్తి అవుతుంద‌ని.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌లోపేతం అయ్యేందుకు స‌హ‌క‌రిస్తుంద‌న్న క‌ల‌లు క‌ల్ల‌లు అయ్యే క్లారిటీ తాజాగా ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు వ‌చ్చిందంటున్నారు.

రాష్ట్రప‌తిగా రామ్ నాథ్ కోవింద్ ప్ర‌మాణస్వీకారోత్స‌వానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఢిల్లీకి వెళ్ల‌టం తెలిసిందే. తాము వ‌చ్చిన ప‌ని పూర్తి అయిన త‌ర్వాత‌.. ఎవ‌రికి వారు మిగిలిన అంశాల మీద దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇద్ద‌రు చంద్రుళ్లు ప్ర‌ధాని మోడీకి స‌న్నిహితుడు.. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ను క‌లిశారు. తమ క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు వీలుగా అసెంబ్లీ సీట్ల పెంపుపై మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని భావించారు.

అయితే.. వారి ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతూ రాజ్ నాథ్ రియాక్ట్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ పెడ‌తామ‌ని చంద్రుళ్ల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. రాజ్ నాథ్ నుంచి ఈ స‌మాధానాన్ని ఏ మాత్రం ఊహించ‌ని ఇద్ద‌రు చంద్రుళ్లు తీవ్ర అస‌హ‌నానికి గురి అయిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అదేమీ రాజ్ నాథ్ ఎదుట ప్ర‌ద‌ర్శించ‌కుండా వెన‌క్కి వ‌చ్చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును హోంశాఖ సిద్ధం చేసింద‌ని.. ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల నుంచి ఓకే అన్న మాట వ‌చ్చిన ప‌క్షంలోనే ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ పెడ‌తామ‌ని రాజ్ నాథ్ స్ప‌ష్టం చేయ‌టం చంద్రుళ్ల‌కు షాకింగ్ గా మారిందంటున్నారు. రాజ్ నాథ్ నుంచి ఊహించ‌ని రియాక్ష‌న్ రావ‌టంతోనే.. అర‌గంట‌కు పైనే స‌మావేశ‌మైన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్లిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సైతం రాజ్ నాథ్ తో సీట్ల పెంపు విష‌యాన్ని ప్ర‌స్తావించినట్లుగా తెలుస్తోంది. దీనికి బ‌లం చేకూరేలా బాబు మాట‌లు ఉన్నాయ‌ని చెప్పొచ్చు. సీట్ల పెంపు అంశాన్ని రాజ్ నాథ్ ద‌గ్గ‌ర గ‌ట్టిగా ప్ర‌స్తావించామ‌ని.. అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంపై మోడీ.. అమిత్ షాల‌తో కూడా ప్ర‌త్యేకంగా భేటీ కావాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల పెంపుపై అంతా ఓకే అనుకునే త‌రుణంలో రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే బిల్లు స‌భ‌లోకి వ‌స్తుందంటూ రాజ్ నాథ్ పెట్టిన మెలిక ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు కోపం తెప్పించేలా చేసింద‌ని చెబుతున్నారు. సీట్ల పెంపు నిర్ణ‌యాన్ని తీసుకున్న ప‌క్షంలో బీజేపీకి న‌ష్టం వాటిల్ల‌టం ఖాయ‌మ‌న్న వాద‌న‌ను రెండు రాష్ట్రాల బీజేపీ నేత‌లు అధినాయ‌క‌త్వానికి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. సీట్లు పెంపు ఓకే అయిన ప‌క్షంలో మ‌రికొంద‌రు నేత‌లు రెండు రాష్ట్రాల్లోని అధికార‌ప‌క్షంలోకి వెళ్లిపోతార‌ని.. అదే సీట్ల పెంపు లేనిప‌క్షంలో బీజేపీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని చెబుతున్నారు. ఏమైనా.. తాజా ఢిల్లీ టూరులో ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు మోడీ స‌న్నిహితుడు రాజ్ నాథ్ షాక్ త‌గిలేలా వ్య‌వ‌హ‌రించార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.