Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ్రేకులేస్తే చంద్రబాబుకే పండగ!

By:  Tupaki Desk   |   20 July 2017 5:10 PM GMT
కేసీఆర్ బ్రేకులేస్తే చంద్రబాబుకే పండగ!
X
ఇదేమిటి.. వారిద్దరూ రాజకీయ మిత్రులు కాదు కద! చంద్రబాబు పండగగా భావించే స్థాయిలో కేసీఆర్ ఎలాంటి చర్యలైనా సరే.. ఎందుకు తీసుకుంటారు..? అనే అనుమానం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించి వేసిన ఒక వ్యాజ్యం... ఇప్పుడు ఇలాంటి సరికొత్త - వెరైటీ సందేహాలకు కారణం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు పెద్ద వరంగా మారుతుందనే భావనతో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారం ఇది!

ఈ ప్రాజెక్టు విషయంలో.. పోలవరానికి సంబంధించి పర్యావరణ మదింపులు పూర్తిస్థాయిలో జరిగిన తర్వాత మాత్రమే.. పనులు కొనసాగించాలని.. ఈ మదింపు అధ్యయనం జరగాల్సి ఉన్నందున అదవి పూర్తయ్యే దాకా పనులు నిలుపుదలచేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సర్కారు సుప్రీం గడప తొక్కింది. గతంలో 30 లక్షల క్యూసెకకులకు తగినట్లు డిజైన్ చేశారని, ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కులకు తగినట్లుగా మారుస్తున్నందున బ్యాక్ వాటర్స్ లో ముంపు ప్రాంతాల పరిధి మారే ప్రమాదం ఉన్నదని, కొత్త గా అధ్యయనం జరగాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కొత్తగా పోలవరం నీటి నిల్వ సామర్థ్యం పెంచినందున ఖమ్మం జిల్లాలోని 9 మండలాల పరిధిలో 100 గ్రామాల వరకు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ వాదిస్తోంది.

తాజాగా ఈ సరికొత్త డిమాండు తెరపైకి రావడంతో ఏం జరుగుతుందనేది చర్చనీయాంశమే. నిల్వసామర్థ్యం పెరిగినప్పుడు తెలంగాణ భయం కూడా సహేతుకమే. అయితే ఈ కేసు వల్ల పనులు ఆగే పరిస్థితి వస్తే చంద్రబాబుకే ఎక్కువ ఎడ్వాంటేజీ అని నాయకులు భావిస్తున్నారు. పోలవరం పనులు ప్రస్తుతం నత్త నడకనే జరుగుతున్నాయి. ప్రతివారం సమీక్షల పేరిట చంద్రబాబు హడావిడి చేస్తున్నారు గానీ.. కార్యక్షేత్రంలో కనిపిస్తున్న ఫలితం చాలా తక్కువ. ఇదొక సమస్య కాగా, అటు పోలవరానికి సంబంధించి పూర్తి ఖర్చు మాదే అని మాటల్లో హామీ ఇచ్చిన కేంద్ర సర్కారు.. ఇప్పటిదాకా మూడేళ్లలో నికరంగా ఇచ్చింది చాలా తక్కువ. నిధుల విడుదల వ్యవహారాలు ఒక పట్టాన తేలడం లేదు. ఈ క్రమంలో అనుకున్న వేగంతో పోలవరం పూర్తి చేయడం.. ఎన్నికల్లోగా ప్రజల దగ్గర మార్కులు కొట్టేయడం అనే చంద్రబాబు కలలు నెరవేరే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారు సుప్రీం ను ఆశ్రియంచిన పుణ్యమాని, స్టే వచ్చి పనులకు గనుక బ్రేక్ పడితే.. ‘హమ్మయ్య’ అంటూ చంద్రబాబు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఒకరకంగా కేసీఆర్ , ఏపీకి వ్యతిరేకంగా వేసిన కేసు, ఆయన రాజకీయ శత్రువు చంద్రబాబునాయుడుకు చాలా గొప్ప మేలు చేస్తుందని అంతా అనుకుంటున్నారు.