Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ‌తికున్నంత వ‌ర‌కు ఆ ఇబ్బందేం ఉండ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   22 Oct 2017 5:39 PM GMT
కేసీఆర్ బ‌తికున్నంత వ‌ర‌కు ఆ ఇబ్బందేం ఉండ‌ద‌ట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు భావోద్వేగ ప్రసంగం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌ టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇవ‌న్నీ పేద‌ల ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మేన‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. తాను బ‌తికి ఉన్నంత‌వ‌ర‌కు పేద ప్ర‌జ‌ల‌కు బాధ‌లు ఉండ‌వ‌ని తెలిపారు. అందు లో భాగంగా ఇప్ప‌టికే ఎన్నో ప‌థ‌కాలు రూపొందించామ‌ని తెలిపారు.

బాలింత‌ల కోసం కేసీఆర్ కిట్స్‌ను - గర్భిణులకు 12 వేల రూపాయాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. `పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి - షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ విద్యార్థుల కోసం 504 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నిరుపేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌ షిప్ ఇస్తున్నాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి.. అసంఘటిత రంగంలో ఉన్న రైతులను సంఘటిత పరిచే విధంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నాం. పశువుల కోసం సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశాం. ఆటోలకు - వ్యవసాయ ట్రాక్టర్లకు పన్నుమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. భూరికార్డుల ప్రక్షాళన చాలా విజయవంతంగా జరుగుతోంది`` అని సీఎం కేసీఆర్ వివ‌రించారు.

వరంగల్ రూరల్‌ లో టెక్స్‌టైల్ పార్క్‌ను అద్భుతంగా నిర్మించుకోబోతున్నామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అజంజాహీ మిల్లును తలదన్నేలా ఉంటుందని వివ‌రించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రపంచమే ఆశ్యర్యపోయే విధంగా పార్మా సిటీ రాబోతుంద‌నిది, రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు జరుగుతాయన్నారు. త్వరలోనే మామునూరు ఎయిర్‌ పోర్టును తయారు చేస్తామన్నారు. టెక్స్‌ టైల్ పార్క్‌ కు కాజీపేట జంక్షన్ కలిసొచ్చే అంశమని కేసీఆర్ తెలిపారు. వరంగల్ నుంచి దేశంలో ఎక్కడికైనా రైలు ద్వారా ప్రయాణం చేయొచ్చని సీఎం పేర్కొన్నారు. వందశాతం అద్భుతంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకోబోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం వలన ఇదంతా సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.