Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట ‘‘13 ఏళ్ల’’ మాట చెప్పేదేమంటే..?

By:  Tupaki Desk   |   28 April 2016 6:47 AM GMT
కేసీఆర్ నోట ‘‘13 ఏళ్ల’’ మాట చెప్పేదేమంటే..?
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచే వచ్చే మాటలు ఊరికే రావు. అందులోకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నేత నోటి నుంచి వచ్చే ప్రతి మాట వెనుక ఎంతో కొంత లెక్క ఉంటుంది. ఆ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. పార్టీ 15వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన పార్టీ నేతలకు ఒక సందేశాన్ని ఇచ్చేశారని చెప్పాలి.

తన ప్రసంగంలో ఇప్పుడు పార్టీ తెలంగాణ అన్ని దిక్కులా విస్తరించిందని.. ఖమ్మం ఉప ఎన్నికలో ఘన విజయం ద్వారా ఖమ్మంలోనూ పార్టీకి తిరుగులేదన్న విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ఉత్సాహపరిచిన ఆయన.. తాను ఎమ్మెల్యే అయ్యాక మంత్రి పదవి చేపట్టటానికి 13 ఏళ్ల సమయం పట్టిందని వ్యాఖ్యానించారు. పదవుల్ని ఆశిస్తున్న ఎంతోమంది టీఆర్ ఎస్ నేతలకు అర్థమయ్యేలా కొన్ని ఉదాహరణల్ని చెప్పుకొచ్చిన కేసీఆర్.. పదవులు ఆశిస్తే రావని.. విధేయతతో వ్యవహరిస్తే వస్తాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. తాను ఉత్తినే చెప్పటం లేదని.. ఇప్పటికే చేతల్లో చేసి చూపించిన విషయాన్ని ఆయన ఉదాహరణతో సహా చెప్పటం గమనార్హం.

బాల్క సుమన్ ఎంపీ అవుతారని ఎవరూ ఊహించలేదని.. కానీ ఆయనకు అవకాశం లభించిందని.. గ్రేటర్ మేయర్ గా బొంతు రామ్మోహన్ ను ఎవరూ అనుకోలేదని.. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ అడిగారని.. కానీ ఇవ్వలేదని.. ఆ తర్వాత గజ్వేల్ విజయం కోసం ఆయనెంతో కృషి చేశారు. తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి నేను ఆయన్ను పిలిపించి టికెట్ ఇచ్చానన్న విషయాన్ని గుర్తు చేశారు. కొద్దిపాటి ఓపిక ఉంటే అవకాశాలు అవే వస్తాయని చెప్పుకొచ్చారు.

ఈ మాటలన్ని చెప్పటం ద్వారా కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి ఒక్కటే. పదవులు కోరుకుంటే రావు. అధినేత అయిన తాను అనుకుంటే మాత్రమే వస్తాయన్న విషయాన్ని చెప్పేశారు. అంతేకాదు.. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయకుండా ఊరిస్తూ.. ఊరిస్తున్న ఆయన మే నెలాఖరు నాటికి 4,500 పదవుల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పదవుల్ని ఆశించే వారికి ఇది తీపి కబురు అయినా.. పదవులు పక్కాగా వస్తాయన్న భరోసా లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాను ఎమ్మెల్యే అయ్యాక మంత్రిని కావటానికి 13 ఏళ్లు పట్టిందన్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించటం చూస్తే.. వచ్చే నెలలో తాను భర్తీ చేసే నామినేటెడ్ పోస్టులు దక్కక అసంతృప్తికి గురి అయ్యే వారు తోక జాడించకూడదన్న హెచ్చరిక ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

పదవులు రావటం.. రాకపోవటం అన్న విషయాన్ని పట్టించుకోకుండా పని చేసే వారికి ఒక రోజు కాకుంటే మరో రోజు అయినా అవకాశం దక్కుతుందన్నట్లుగా చెప్పిన కేసీఆర్ మాటల్లో మర్మం చాలానే దాగి ఉందన్న విషయాన్ని గర్తించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లోపదవుల కోసం ఓపిక.. సహనం అంతకంతకు చాలా అవసరమన్నది స్పష్టం చేశారని చెప్పక తప్పదు. సందేశం ఇచ్చినట్లు పైకి కనిపించినా.. కేసీఆర్ మాటల లోతుల్లోకి తరచి చూస్తే.. తొందరపడి తోక జాడిస్తే అంతే సంగతులు సుమా అన్న వార్నింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆరా మజాకానా.