Begin typing your search above and press return to search.

నోరు జారితే కేసులే అంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   22 April 2017 4:49 AM GMT
నోరు జారితే కేసులే అంటున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు విమ‌ర్శ‌కుల‌ను ఘాటుగా హెచ్చరించారు. ఇటీవ‌ల ప్ర‌భుత్వంపై వివిధ రూపాల్లో దాడి పెరుగుతున్న నేప‌థ్యంలో శృతిమించిన కామెంట్ల‌పై కేసులు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ ఎస్‌ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో జరిగిన ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ ‘మాది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. కడుపు కట్టుకొని ఉద్యమ స్ఫూర్తితో అవినీతిరహిత పాలన అందిస్తున్నాం. అయినప్పటికీ ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులతో నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎంత మాత్రం సహించేది లేదు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తే ఆ శాఖ మంత్రి స్పందించి శాఖపరంగా కేసులు పెడతారు’ అని స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రిక చేశారు. ఇకనైనా గుడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన విపక్షాలకు హితవు పలికారు.

గత టీడీపీ - కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని దోపిడీ చేసి ఖజానాకు గండికొట్టారని కేసీఆర్‌ దుయ్యబట్టారు. వారి హయాంలో ఇసుక మాఫియాల వల్ల ఐదు లక్షల రూపాయాలకు పడిపోయిన ఆదాయాన్ని తాము అధికారంలోకి వచ్చాక గత ఏడాది రూ.375 కోట్లు, ఈ ఏడాది రూ. 460 కోట్లకు తీసుకొచ్చామని, అవినీతి రహిత పాలనకు, తమ చిత్తశుద్ధికి ఇదే తార్కాణమని కేసీఆర్‌ తెలిపారు. ప్రజల మనోభిష్టాన్ని 100 శాతం నెరవేరుస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మరే రాష్ట్రంలో లేని విధంగా 135 జీవోల ద్వారా 155 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ - అభివృద్ధి పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని తెరాస శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీలు - దేవాలయ కమిటీలలో ఇప్పటికే పార్టీ శ్రేణులకు కొన్ని పదవులు ఇచ్చామని, త్వరలో మరిన్ని నామినేటెట్ పదవులు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పార్టీ సభ్యత్వాల సంఖ్య 75 లక్షలకు చేరుకోవడంతో వారిని ఆదుకునేందుకు మంత్రులతో మాట్లాడి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/