Begin typing your search above and press return to search.

కేసీఆర్ జీ.. మీ టైమింగ్ అదిరిందండి!

By:  Tupaki Desk   |   22 Feb 2019 10:34 AM GMT
కేసీఆర్ జీ.. మీ టైమింగ్ అదిరిందండి!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు న‌మ్మ‌కాలు ఎక్కువ‌న్న విష‌యం ఓపెన్ సీక్రెట్‌. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ జ‌మానాలోనూ ఆయ‌న‌కు అలాంటి న‌మ్మ‌కాలు చాలానే ఉండేవి. ఆయ‌న న‌మ్మ‌కాలు.. సెంటిమెంట్ల మీద కార్టూన్లు వేసి ర‌చ్చ ర‌చ్చ చేయ‌ట‌మే కాదు.. ఆయ‌న్ను ఎట‌కారం ఆడేసి.. వేళాకోళం చేసేసిన వామ‌ప‌క్ష మేధావులు బోలెడంత మంది. కానీ.. కాలం మార‌టం.. అందునా కేసీఆర్ జామానాలో అలాంటి వాటికి ఏ మాత్రం చోటు లేక‌పోవ‌టం.. ఒక‌వేళ ఎవ‌రైనా ఆ ప‌ని చేస్తే.. వారి విష‌యంలో జ‌ర‌గాల్సిన‌వి జ‌రిగిపోతున్న వేళ‌.. ఎవ‌రూ నోరెత్త‌ని ప‌రిస్థితి.

తెలంగాణ‌లో ఇప్పుడెలాంటి ప‌రిస్థితి ఉందంటే.. ముఖ్య‌మంత్రి స‌చివాల‌యానికి రారేం అని అడిగే సాహ‌సం చేయ‌రు. ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టు సాహ‌సం చేసి అడిగితే.. కేసీఆర్ దాన్ని ఎంత ఎట‌కారం చేయాలో అంత చేయ‌ట‌మే కాదు.. ఎందుకు ప్ర‌శ్న అడిగామే అన్న భావ‌న క‌లిగేలా చేసే ప‌రిస్థితి. దీంతో.. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల రిపోర్ట‌ర్లు మొద‌లు ఒక మోస్త‌రు మీడియా సంస్థ‌ల‌కు చెందిన పాత్రికేయులు ఎవ‌రూ కేసీఆర్ హ‌ర్ట్ అయ్యే ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం మానేసి చాలా కాల‌మే అయ్యింది.

ఇదంతా ఎందుకంటే.. కేసీఆర్ కున్న న‌మ్మ‌కాల గురించి. ఆయ‌న కొన్నింటి విష‌యంలో చాలా శ్ర‌ద్ధ చూపిస్తుంటారు. త‌న ల‌క్కీ నెంబ‌ర్ అయిన ఆరు కావొచ్చు.. కొత్త ప‌ని మొద‌లు పెట్టే వేళ‌లో ముహుర్తాలు చూసుకోవ‌టం లాంటివి చేస్తుంటారు. తాజాగా తాను తొలిసారి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన నేప‌థ్యంలో ఆయ‌న తాను న‌మ్మే సెంటిమెంట్ ను ప‌క్కాగా పాటించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఎందుకంటే.. అసెంబ్లీ స‌మావేశ‌మైంది 11.30 గంట‌ల‌కే అయినా.. 12.12 గంట‌ల‌కు కేసీఆర్ బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని షురూ చేశారు. ఈ స‌మ‌యాన్ని కూడితే ఆరు అంకె వ‌స్తుంది. మ‌రి.. ముందుగానే ప్రాక్టీస్ చేశారో.. లేక అనుకోకుండా జ‌రిగిందో కానీ.. కేసీఆర్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ముగించింది కూడా ఆరు అంకె వ‌చ్చేలా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.12.12 గంట‌ల‌కు మొద‌లైన ఆయ‌న బ‌డ్జెట్ ప్ర‌సంగం 1.05 గంట‌ల‌కు ముగిసింది. ఒక‌వేళ ముందుగా ప్రిపేర్ అయి వ‌చ్చినా.. ప్రిపేర్ కాకుండా వ‌చ్చినా రెండు త‌న‌కు ఇష్ట‌మైన సంఖ్య‌ల‌తో ముగియ‌టం మాత్రం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌వేళ ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ఈ అంకెలు వ‌స్తే మాత్రం.. కేసీఆర్ కు కాలం కూడా త‌న తోడ్పాటును అందిస్తుంద‌నే చెప్పాలి.