Begin typing your search above and press return to search.

ఆ సామాన్యుడిని కేసీఆర్ తెగపొగిడారు

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:09 AM GMT
ఆ సామాన్యుడిని కేసీఆర్ తెగపొగిడారు
X
ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి ఇచ్చేస్తూ.. ముందుకెళ్లటం మంచి మేనేజర్లలో కనిపించే లక్షణం. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్నినడిపించే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి కీలక నేతకు కొండంత స్ఫూర్తిని ఇవ్వటం అంత చిన్నదైన విషయం కాదు. కానీ.. అలాంటి వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించటమే కాదు.. అలాంటి వారి పేర్లను పదే పదే ప్రస్తావించే పెద్దమనసు కేసీఆర్ దే. గొప్పతనం అంతా నాదేనని చెప్పేసుకునే తీరుకు భిన్నమైన ఈ వైఖరి ప్రజల్ని ఆకర్షించటమే కాదు.. గౌరవాన్ని మరింత పెంచుతుంది. తాజాగా ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన చిన్న రాజన్న అనే పెద్దమనిషి గురించి పదే పదే ప్రస్తావించారు. ఇంతకీ ఆయన గొప్పతనం ఏంది? ఆయన చేసిన ఏ పని కేసీఆర్ ను అంతగా కదిలించిందన్నది చూస్తే.. ఆ ముచ్చటే ఆసక్తికరంగా ఉంటుందని చెప్పక తప్పదు.

అచ్చు సినిమాల్లోనూ.. కథల్లోనో చెప్పినట్లుగా అంకాపూర్ గ్రామం మొత్తాన్ని ఏకం చేసి.. గ్రామస్తులంతా కలిసి వ్యవసాయం చేసి భారీగా డబ్బులు సంపాదించే విధానాన్ని డిజైన్ చేయటమే కాదు.. దాన్ని విజయవంతంగా అమలు చేసిన సత్తా చిన్నరాజన్న గొప్పతనం. అదే.. కేసీఆర్ ను విపరీతంగా ఆకర్షించింది. తన దత్తత గ్రామాలు ఎర్రవెల్లి.. నర్సాపూర్ లలో తాజాగా ఇదే విధానాన్ని అమలు చేయాలని తపిస్తున్నారు.

ఇందులో భాగంగా తన తొలి ఆలోచనను తాజాగా ఆవిష్కరించిన కేసీఆర్.. మరో రెండు వారాల్లో రెండు గ్రామాల వారు వేసిన పంట మొత్తాన్ని అందరూ కలిసి కోత కోసుకోవాలని.. సమిష్టిగా పనులు చేసుకొని.. లాభాన్ని పంచుకోవాలని సూచించారు. ఈసందర్భంగా తనకు స్ఫూర్తినిచ్చిన చిన్నరాజన్న ఆలోచన గురించి.. ఆయన నేతృత్వంలో అంకాపూర్ గ్రామం సాధించిన గొప్పతనం గురించి కేసీఆర్ మాటల్లో వింటే.. మరింత ఆసక్తికరంగా అనిపించటం ఖాయం.

‘‘నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లో చిన్నరాజన్నఅనే పెద్ద మనిషి ఉన్నారు. కాపు వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు వచ్చిన ఆలోచన ఇప్పుడా గ్రామాన్ని ఒక్క తాటి మీద నడిపిస్తుంది. ఆ ఊర్లోకి వెళితే పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తాయి. మన బంజారాహిల్స్ మాదిరి. అలా అని అక్కడ భూములు చూస్తే.. మనకంటే మంచి వేం కావు. వారేం పరిశ్రమలు పెట్టలేదు. కేవలం వ్యవసాయం చేసే దర్జాగా బతుకుతుండ్రు. అందరూ కలిసి సమిష్టిగా వ్యవసాయం చేస్తారు. కలిసి ఉండటం.. కలిసి పని చేయటం.. కలిసి కష్టపడటమే వారి గొప్పతనం. అదే వారిని ఇప్పుడందరూ చెప్పుకునేలా చేసింది. ఆ గ్రామస్తులకు బ్యాంకు ఖాతాలు చూస్తే కోట్ల రూపాయిల డిపాజిట్లు ఉన్నాయ్. అక్కడి ఇండ్లలో లెక్కల ముచ్చట అంతా మహిళలదే. మీరు కోపం కావొద్దు కానీ.. మన కంటే ఆడోళ్లే లెక్కలు బాగా వేయగలరు. మనకంటే మంచి వారు మేనేజర్లు. డబ్బుల్ని జాగ్రత్తగా దాచి లెక్కగా ఖర్చుచేయాలంటే ఆడోళ్ల తర్వాతే ఎవరైనా. మన చేతికి నాలుగు రూపాయిలు వస్తే.. మన ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయ్. కానీ.. వాళ్ల చేతికి డబ్బుల లెక్క అప్పజెబితే.. ఎంతో జాగ్రత్తగా.. ముందుచూపుతో వ్యవహరిస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

అంకాపూర్ గ్రామస్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని.. ఎర్రవెల్లి.. నర్సాపూర్ గ్రామస్తులంతా కలిసి రెండు కమిటీలుగా ఏర్పడి.. మొక్కజొన్న.. సోయాబీన్ పంట కోతల్ని సమిష్టిగా పూర్తి చేయటమే కాదు.. రెండో పంటను కూడా కలిసి వేయాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లకు కొదవ లేని నేపథ్యంలో.. మూడో పంట వేసుకునే అవకాశాన్ని మిస్ కాకూడదని చెప్పారు. అంకాపూర్ రాజన్న గొప్పను కీర్తిస్తూ.. ఎర్రవెల్లి.. నర్సాపూర్ గ్రామస్తుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ముఖ్యమంత్రి.. మరోరెండు వారాల్లో పంట కోతకు ముహుర్తం పెట్టాలని.. ఆ కార్యక్రమానికి తాను కూడా వచ్చి కోత కోస్తానని చెప్పి మనసు దోచుకున్నారు. ఇలా సామాన్యుల విజయగాథల్ని చెప్పి.. జనాల్లో కొత్త చైతన్యం తేవటంలో కేసీఆర్ మొనగాడని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/