Begin typing your search above and press return to search.

డాక్యుమెంట‌రీలు, సీడీల‌తో కేసీఆర్ రాజ‌కీయం

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:51 PM GMT
డాక్యుమెంట‌రీలు, సీడీల‌తో కేసీఆర్ రాజ‌కీయం
X
టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యం చేయక్క‌ర్లేదు. త‌న‌దైన మార్కు చాణక్యంతో ఆధునిక రాజకీయాల్లో అందెవేసిన చెయ్యి అన్న పేరు ఎప్పుడో తెచ్చుకున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తిగా అనేక ర‌కాల ప్ర‌ణాళిక‌లు అమ‌ల్లో పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో తాను చేసిన కార్య‌క్ర‌మాల‌కు వినూత్న రీతిలో ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అదే వీడియోల‌తో ఆక‌ట్టుకోవ‌డం. ప్ర‌త్యేకంగా డాక్యుమెంట‌రీలు, వీడియోల‌తో వివిధ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసేశారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త పథకాలు, సరికొత్త కార్యక్రమాలతో సుపరిపాలనకు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్న ఆయన వచ్చే ఐదేళ్ళపై దృష్టి పెట్టారు. అందుకోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.ఇందులో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలపై డాక్యుమెంటరీలు సిద్ధం చేస్తున్నా రు. వాటిని కేవలం ప్రజల్లోకి వదిలి ఊరుకోకుండా, వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చూసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నది కేసీఆర్‌ ఆలోచన. ఇందుకోసం డాక్యుమెంట‌రీలు సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణలో ప్రతిష్టాత్మక పథకాలు విజయవంతంగా అమలు చేయడానికి దోహదపడిన అంశాలపై డాక్యుమెంటరీలు తయారు చేస్తున్నారు. ఈ విధానంతో ప్రజల్లోకి వెళితే పరిపాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై స్పష్టత వస్తే మరింత మెరుగైన పాలన అందించేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మక ఆలోచన ఉన్నారు. అధికార వర్గాల ద్వారా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు సుమారు 30 డాక్యుమెంటరీలు, మరో 20 లఘు చిత్రాలు రూపొందించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేకమైన సామాజిక అంశాలను ఎంచుకుని డాక్యుమెంటరీలు తయారు చేయబోతున్నారు.

గరిష్టంగా నెల రోజుల్లోగా డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలను రూపొందించే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పార్టీ ప్రముఖులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేయనున్నారు. త్వరలో జరుగనున్న బడ్జెట్‌ సమావేశాల నాటికి వీటికి తుదిరూపం ఇవ్వాలన్నది కేసీఆర్‌ ఆలోచన. ఇప్పుడున్న పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఉన్న ముందుచూపు, ప్రజాదరణ పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలను విస్తృత పరిచి తద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు న్యాయం చేకూర్చే విధానంపై ప్రజలకు స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణ వెనకబాటుతనాన్ని తరిమికొట్టే విధంగా తాను తీసుకున్న కీలక నిర్ణయాలు, తదనంతర క్రమంలో అమలైన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను హైలైట్‌ చేయబోతున్నారు.