Begin typing your search above and press return to search.

కేసీఆర్ వాస్తు ముచ్చ‌ట‌కు అవ‌న్నీ నేల‌మ‌ట్టం!

By:  Tupaki Desk   |   24 Jun 2019 7:30 AM GMT
కేసీఆర్ వాస్తు ముచ్చ‌ట‌కు అవ‌న్నీ నేల‌మ‌ట్టం!
X
సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిన చందంగా మారింది తెలంగాణ‌లోని కొన్ని నిర్మాణాల‌కు. నిక్షేపంగా ఉన్న ప‌లుభ‌వ‌నాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వాస్తు న‌మ్మ‌కానికి నేల‌మ‌ట్టం కానున్నాయి. ఇప్ప‌టికే స‌చివాల‌యంలోని భ‌వ‌నాల్ని కూల్చివేయాల‌ని డిసైడ్ అయిన సీఎం సాబ్‌.. తాజాగా స‌చివాల‌యానికి ఉన్న వాస్తు దోషాన్ని సెట్ చేసేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

దాదాపు రూ.400 కోట్ల ఖ‌ర్చుతో తెలంగాణ స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించ‌టం తెలిసిందే. అంచ‌నా వ్య‌య‌మే ఇంత భారీగా ఉంటే.. భ‌వ‌నం పూర్తి అయ్యేనాటికి ఎంతోకొంత అంచ‌నా పెర‌గ‌క మాన‌దు. ఇదిలా ఉంటే.. వాస్తు దోషం ఉంద‌న్న భావ‌న‌తో స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి నిర్మిస్తున్న నేప‌థ్యంలో.. ఆ న‌మ్మ‌కానికి అడ్డుగా ఉన్న కొన్ని భ‌వ‌నాల్ని కూడా కూల్చివేయాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

కొత్త స‌చివాల‌యం న‌లువైపులా రోడ్లు ఉండేలా కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. సీ బ్లాక్ వెనుక భాగంలో కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ మింట్ కాంపౌండ్ లో ప్ర‌భుత్వ ప్రింటింగ్ ప్రెస్ మిన‌హా.. మిగిలిన భ‌వ‌నాల‌న్నీ రాష్ట్ర ప్ర‌భుత్వం అధ్వ‌ర్యంలో న‌డుస్తున్న‌వే. వీటిల్లో చాలావ‌ర‌కూ తాజాగా కూల్చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌చివాల‌యానికి ఉన్న వాస్తుదోషాన్ని సెట్ చేసేందుకు చ‌తుర‌స్రాకారంలోకి తేవాల‌ని చూస్తున్నారు.

ఇందుకు అవ‌స‌ర‌మైన భ‌వ‌నాల్ని నేల‌మ‌ట్టం చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ గేటు ప‌క్క‌నే ఉన్న విద్యుత్ కార్యాల‌య భ‌వ‌నాలు.. ఉద్యోగ కార్యాల‌యాలు.. ఇత‌ర భ‌వ‌నాల్ని కూల్చి వేసి స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోకి క‌ల‌ప‌నున్నారు. దీంతో.. స్థ‌లం సీఎం కేసీఆర్ కోరుకున్న‌ట్లు చ‌తుర‌స్రాకారంలోకి వ‌చ్చేస్తుంది. అదే జ‌రిగితే వాస్తు దోషం ఉండదంటున్నారు. మొత్తానికి ముఖ్య‌మంత్రి వారి న‌మ్మ‌కాల‌కు త‌గ్గ‌ట్లుగా కూల‌గొట్టే భ‌వ‌నాల జాబితాలో చేరిన కొత్త భ‌వ‌నాల విష‌యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.