Begin typing your search above and press return to search.

కలలు కంటే కేసీఆర్ మాదిరి కనాలి భయ్

By:  Tupaki Desk   |   31 May 2016 5:00 AM GMT
కలలు కంటే కేసీఆర్ మాదిరి కనాలి భయ్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాప్నికుడు. దివంగత మాజీ రాష్ట్రపతి కలాం చెప్పినట్లుగా ఆయన నిత్యం కలలు కంటుంటారు. అది కూడా పేద్ద..పేద్ద కలలు కంటుంటారు. ఆయనంటే పడనోళ్లు అయితే.. కేసీఆర్ కలల్లోనే బతుకుతుంటారని ఎద్దేవా చేస్తారు కూడా. కానీ.. తాను కనే కలల్ని సాకారం చేసేందుకు కేసీఆర్ అనుక్షణం తపిస్తారు. అదే.. తెలంగాణను ఒక రాష్ట్రంగా ఏర్పాటు అయ్యేలా చేసిందని చెప్పాలి.

తన జీవిత లక్ష్యమైన తెలంగాణ సాధనతో ఆగిపోతే ఆయన కేసీఆర్ అయ్యే వారే కాదు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రికార్డుల్లో ఎక్కటానికి ఆయన పడిన తపన అంతా ఇంతా కాదు. కష్టపడే వాడికి కాలం కలిసి వస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రొడ్డుకొట్టుడు వ్యవహారశైలికి భిన్నంగా.. తనదైన మార్క్ తో రెండేళ్ల పాలనను పూర్తి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే తన పదవీకాలంలో 40 శాతం కాలాన్ని పూర్తి చేశారు.

ఈ రెండేళ్ల కాలంలో కేసీఆర్ చాలానే కలల్ని కన్నారు. తాను కన్న కలల్ని తనతోనే ఉంచుకోకుండా ప్రజలకు పంచారు. తన కలలకు ప్రతిరూపాలుగా కొన్ని గ్రాఫిక్స్ తయారు చేయించారు. గతంలో కొన్ని గ్రాఫిక్ డిజైన్స్ ను బయటకు విడుదల చేసి.. తన రాజకీయ ప్రత్యర్థులకు సైతం నోట సైతం ‘‘వావ్’’ అనిపించేలా చేసిన ఆయన.. తాజాగా తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించిన ఊహా చిత్రాల్ని విడుదల చేశారు. అందులో ఇప్పుడున్న సచివాలయాన్ని పడగొట్టి.. కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న తన కలను ఆవిష్కరించారు. దీంతో పాటు.. ఇందిరా పార్కు దగ్గర నిర్మించే కళాభవన్ ఊహా చిత్రాన్ని విడుదల చేసి.. కలలు కంటే కేసీఆర్ మాదిరే కనాలన్నట్లుగా తాజాగా విడుదలైన ఆయన ఊహాచిత్రాలు ఉండటం గమనార్హం.