Begin typing your search above and press return to search.

ఆటోబ‌యోగ్ర‌ఫీ రాస్తున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   21 Jan 2017 8:19 AM GMT
ఆటోబ‌యోగ్ర‌ఫీ రాస్తున్న కేసీఆర్‌
X
మైక్ దొరికితే మాటల తూటాలు పేల్చే టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లం పట్టి పుస్త‌కం రాస్తే ఎలా ఉంటుంది? అందులోనూ సొంత జీవిత చ‌రిత్ర రాస్తే...అలాంటి ఆటో బ‌యోగ్ర‌ఫీ గురించిన ఆస‌క్తి మాట‌ల్లో చెప్ప‌లేం క‌దా. తెలంగాణ ఉద్య‌మ కారుడిగా వేలకు వేలు పుస్తకాలు చదివిన కేసీఆర్ తన జీవిత పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చే పనిలో పడ్డారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. గత కొంత కాలంగా క్యాంప్ ఆఫీసుకే ప‌రిమితం అవుతున్న గులాబీ ద‌ళ‌ప‌తి తన ఆత్మకథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

కేసీఆర్ అత్యంత‌ సన్నిహితులు చెబుతున్న దాని ప్ర‌కారం ఆటో బయోగ్రఫీ దాదాపుగా సగానికి పైగా పూర్తైంది. ఈ కేసీఆర్ ఆత్మకథలో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. తన జీవితం మొదలు నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తెలంగాణ పోరాటం చివరకు కల సాకారం లాంటి చారిత్రక ఘట్టాలను మరోసారి నెమరు వేసుకుంటూ వాటికి కేసీఆర్‌ అక్షర రూపం ఇస్తున్నారు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన తన అనుభవాలను పుస్తకంగా మలుస్తున్నారని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రపంచానికి తెలియని కొన్ని సంఘటనలో తన పుస్తకం ద్వారా కేసీఆర్ బహిర్గతం చేస్తారని తెలుస్తోంది. అప్పట్లో అధికార కాంగ్రెస్ నేతలు తనతో జరిపిన రహస్య సంప్రదింపులు - ప్రత్యేక తెలంగాణపై వారి అభిప్రాయాలు ఇవన్నీ కేసీఆర్ ఆత్మకథలో కన్పించనున్నాయి. ప్రధానంగా ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నేతలు బహిరంగంగా మాట్లాడలేక తనతో ఆఫ్ ది రికార్డ్ గా ఏం చెప్పారు ? అన్న గుట్టు కూడా విప్పనున్నారట. అంతేకాదు మంత్రి పదవి ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకొచ్చారన్న దానిపైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైక్ దొరికితే మాటల తూటాలు పేల్చే కేసీఆర్ కలంతో ఎలాంటి కలకలం సృష్టిస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా పోరాటపంథాలోని అక్ష‌ర‌బ‌ద్దమైన అంశాల‌తో పాటు కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన ప‌లు అంశాల‌ను కేసీఆర్ తెలుసుకున్నారు. ఇలా తెలంగాణ చరిత్ర గురించి కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది కొంద‌రి భావ‌న‌. తెలంగాణకు సంబంధించి కొన్ని నిజాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయని, ఆ నిజాలకు అబద్ధపు రంగులు పూసిన సందర్భాలు ఉన్న వాటిని వెలికి తీసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సాధనలో లోటుపాట్లు, ఆ సమయంలో మథనపడిన అంశాల గురించి కేసీఆర్ తన ఆత్మకథలో పొందుపరచనున్నారు. మొత్తంగా కేసీఆర్ ఆత్మకథ అందులో ఆసక్తికర అంశాల గురించి అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/