మూడు 16లతో కేసీఆర్ ఫుల్ ఖుషీ చేస్తారట!

Tue Feb 12 2019 13:35:20 GMT+0530 (IST)

వినేందుకు కమ్మగా ఉంటూ.. లాజిక్కు సరిపోయేలా ఉండే వాదనలు ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికరంగా మారాయి. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనదై ప్రపంచంలో ఉంటూ.. పరిమితంగా మాత్రమే సమాచారం ఇచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని.. గులాబీ నేతలకు ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొన్నటి వరకూ మంత్రివర్గ విస్తరణ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలకు కేసీఆర్ తీవ్ర నిరాశను మిగిల్చారు.అయినప్పటికి పల్లెత్తు మాట అనేందుకు గులాబీ నేతలు ఇష్టపడటం లేదు. నోట్లో నుంచి వచ్చే చిన్న మాటతో తమ జాతకం మారిపోతుందన్న భయంతో వారున్నట్లుగా చెప్పక తప్పదు. ఊరించే పదవులు.. అవకాశాల కోసం తపిస్తున్న గులాబీ నేతల దిల్ ఖుష్ చేసేలా కేసీఆర్ తాజాగా భారీ ప్లాన్ ఒకటి తయారుచేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే పూర్తి చేయాల్సిన మంత్రివర్గ విస్తరణ.. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల జాబితాతో పాటు.. రానున్న లోక్ సభ ఎన్నికల అభ్యర్థులు.. ఇలా మొత్తం మూడు 16 జాబితాల్ని కేసీఆర్ తయారుచేస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల వ్యవధిలో ఈ మూడు జాబితాలను ఒకటి తర్వాత ఒకటిగా కానీ.. మొత్తంగా ఒకటిగా కానీ విడుదల చేస్తారని చెబుతున్నారు.

ఈ మూడు జాబితాలతో సీన్ మొత్తం మారిపోతుందని.. అసంతృప్తులు పెద్దగా ఉండరని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన భారీ కసరత్తు ఇప్పటికే పూర్తి అయ్యిందని చెబుతున్నారు. మరోవైపు మాత్రం ఇందుకు భిన్నంగా కొన్ని చిన్న చిన్న అంశాల విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. వాటిని కూడా పూర్తి చేసి.. మూడు రోజుల్లో ప్రకటించే వీలుందన్న మాట బలంగా వినిపిస్తుంది. అదే జరిగితే గులాబీ నేతలకు అంతకు మించిన శుభవార్త మరొకటి ఉండదని చెప్పక తప్పదు.