Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు; మోడీతో ‘షాకుల’ కేసీఆర్ భేటీ

By:  Tupaki Desk   |   12 Feb 2016 3:58 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు; మోడీతో ‘షాకుల’ కేసీఆర్ భేటీ
X
అయితే హైదరాబాద్ లేదంటే.. ఫాంహౌస్ కి వెళ్లి సేద తీరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్తంత అరుదుగానే తెలంగాణ రాష్ట్రం బయటకు వెళుతుంటారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి తరచూ ఢిల్లీకి వెళ్లటం.. అక్కడ పనులు చక్కదిద్దటం లాంటివి అస్సలు చేయరు. తన వాళ్లతో అలాంటి పనులు పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాస్త అరుదుగానే ఆయన ఢిల్లీకి వెళుతుంటారు. తాను ఫోకస్ చేసిన ఏ అంశాన్నైనా తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్న కేసీఆర్ కు.. ప్రధాని మోడీ మనసును గెలుచుకునే విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మోడీని ఈ రేంజ్ లో కూడా విమర్శించొచ్చా అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన నాటి నుంచి మోడీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆయన్ను దగ్గరకు రానిచ్చేందుకు మోడీ పెద్దగా ఇష్టపడలేదు. నీతిఅయోగ్ సందర్భంగా మోడీని కేసీఆర్ కీర్తిస్తే.. కేసీఆర్ స్పీడ్ ను మోడీ ప్రశంసించారు. అంతకు మినహా మోడీ కేసీఆర్ ను ప్రత్యేకంగా పొగిడింది లేదు.

కానీ.. ఆ తర్వాత నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారీ మోడీపై ప్రశంసలు కురిపిస్తూ.. విజన్ ఉన్న నేతగా అభివర్ణిస్తున్నారు. ఒకవైపు ప్రశంసిస్తూనే.. మరోవైపు మోడీకి చురుకు పుట్టేలా విమర్శలు చేయటం కేసీఆర్ కే చెల్లుతుంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలు గడిచిపోయినా ఇప్పటికి ఆయన హైదరాబాద్ కు రాలేదంటూ మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే విమర్శలు చేశారు.

మోడీ విషయంలో కేసీఆర్ ఆచితూచి విమర్శలు చేస్తే.. కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఆయనపై తరచూ విమర్శలు చేయటం చేస్తుంటాం. వీరి వైఖరికి తగ్గట్లే.. తనను కలవాలని భావించిన ప్రతిసారీ కేసీఆర్ ను చిన్నబుచ్చుతూ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం తెలిసిందే. మోడీని కలిసేందుకు పలుమార్లు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఆయన అపాయింట్ మెంట్ సైతం దొరకబుచ్చుకోలేకపోయారు.

తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. మోడీకి మంచి మిత్రుడైన చంద్రబాబు పార్టీకి తెలంగాణలో షాకులిస్తూ.. షాకుల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో బస చేయనున్న కేసీఆర్.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

ఆదివారం నగరానికి తిరిగి వచ్చే ఆయన.. ఢిల్లీలో ప్రధాని సహా.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మోడీని తెలంగాణకు ఆహ్వానించనున్నారని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో ఢిల్లీకి పయనమైన కేసీఆర్.. ప్రధాని మోడీని కలిసి తన కోర్కెల చిట్టాను ఆయనకు విన్నవిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.