Begin typing your search above and press return to search.

కేసీఆర్ గారూ!...సెక్ర‌టేరియ‌ట్ ముఖ‌మే చూడ‌రా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 4:41 PM GMT
కేసీఆర్ గారూ!...సెక్ర‌టేరియ‌ట్ ముఖ‌మే చూడ‌రా?
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుది నిజంగానే ఓ వెరైటీ మెంటాలిటి. పంచాంగాలు, శుభ ముహూర్తాలను చూసుకోనిదే కాలు బ‌య‌ట‌పెట్ట‌ని కేసీఆర్‌... ఈ విష‌యంలో ఎవ‌రేమ‌నుకున్నా కూడా ఏమాత్రం ప‌ట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే కొంప‌లు త‌గ‌ల‌బ‌డుతున్నా కూడా పంచాంగం - ముహూర్తాలు చూసుకోనిదే కేసీఆర్ రంగంలోకి దిగ‌రు. ఇందుకు ఇప్ప‌టికే చాలా నిద‌ర్శ‌నాలున్నాయి. వాస్తు దోష‌ముంద‌న్న కార‌ణంగానే క‌దా... కేసీఆర్ ఇప్ప‌టిదాకా పాత సెక్ర‌టేరియ‌ట్ ముఖం చూడ‌నిది. ఇక మొన్న‌టి తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహం కూడా వాస్తును చూసుకునే క‌దా నిర్దేశించుకున్న‌ది. మ‌రి సెక్ర‌టేరియ‌ట్‌లో కాలు పెట్ట‌కుంటే పాల‌న సాగేదెలా? ప‌్ర‌గ‌తి భ‌వ‌న్ ను క‌ట్టుకున్న‌ది అందుకే క‌దా.

మొత్తంగా కేసీఆర్ ను మార్చ‌డం ఏ ఒక్క‌రి త‌రం కాదు క‌దా..అంతా ఆయ‌న బాట‌లోనే న‌డ‌వాలి. అందుకే సెక్ర‌టేరియ‌ట్‌ లో సంత‌కాలు కావాల్సిన ఫైళ్ల‌న్నీ ఇప్పుడు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు ప‌రుగులు పెడుతున్నాయి. వీటిన్నింటికీ పీక్స్ అన్న స్థాయిలో ఇప్పుడు ఏకంగా కేబినెట్ భేటీల‌ను కూడా కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌నే ఎంచుకున్నారు. మొన్ననే కొత్త‌గా కొలువుదీరిన మంత్రివ‌ర్గంతో కేసీఆర్ నేడు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోనే భేటీ అయ్యారు. రేపు ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ కు ఆమోదం తెలిపేందుకు కూడా ప్ర‌గ‌తి భ‌వ‌నే వేదిక కానుంది. రేపు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నేప‌థ్యంలో రేపు ఉద‌య‌మే... ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో భేటీ కానున్న తెలంగాణ కేబినెట్ అక్క‌డే దానికి ఆమోద ముద్ర వేయ‌నుంది. ఆ త‌ర్వాతే బ‌డ్జెట్ ప్ర‌తులు అసెంబ్లీకి వెళ‌తాయి. మొత్తంగా కొత్త సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం పూర్త‌య్యే దాకా ప్ర‌గ‌తి భ‌వ‌నే కేసీఆర్ కు కార్య‌క్షేత్రంగా నిల‌వ‌నుంద‌న్న‌మాట‌.

ఇక రేపు అసెంబ్లీ ముందుకు రానున్న తెలంగాణ ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ విష‌యానికి వ‌స్తే... పేరుకు ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్టే అయినా... ఇది ఏకంగా రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌ను దాటే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నికల సందర్భంగా నాడు కేసీఆర్ ఇచ్చిన హామీలతో బడ్జెట్ పెరిగిపోయిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ భారీ ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ను స్వ‌యంగా సీఎం కేసీఆరే సభలో ప్రవేశపెట్టనున్నారు.