Begin typing your search above and press return to search.

హై టెక్ పాల‌న అంటే ఏంటో చూపిస్తా- కేసీఆర్

By:  Tupaki Desk   |   11 April 2018 6:49 AM GMT
హై టెక్ పాల‌న అంటే ఏంటో చూపిస్తా- కేసీఆర్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. టెక్నాల‌జీ ప‌రిపాల‌న అంటే ఏంటో చాటిచెప్పేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి ఆర్డ‌ర్‌తో ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ టీం రంగంలోకి దిగింది. ఏకంగా 265 ప్ర‌భుత్వ వెబ్‌ సైట్ల‌ను ఐటీ శాఖ‌తో అనుసంధానం చేసి త‌మ ప‌రిపాల‌న‌ను రీ డిజైన్ చేస్తోంది. అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే టీ వెబ్‌ను తీసుకురానుంది. ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ ఐటీశాఖ పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాట్లుచేస్తున్నది. సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో గుడ్ గవర్నెన్స్ అధికారులు ప్రభుత్వ డాష్ బోర్డును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.

తాజా విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యంతో ప్రభుత్వశాఖలు - జిల్లాలవారీగా జరుగుతున్న అభివృద్ధిపనులు - సంక్షేమ పథకాలు - ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలన్నింటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకొని సమీక్షించేలా ఏర్పాట్లుచేస్తున్నారు. డాష్‌బోర్డులో వివిధ ప్రభుత్వశాఖలు - సంస్థలు - కార్పొరేషన్లు నిర్వహిస్తున్న 265 వెబ్‌ సైట్లను మానిటరింగ్ చేసేలా టీ వెబ్‌ ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్‌ సైట్లన్నింటినీ అనుసంధానం చేయడంతోపాటు ప్రభుత్వ అధికారిక వెబ్‌ సైట్‌ లో అన్నిశాఖలకు చెందిన సమాచారం ఉంటుంది. ఐటీశాఖ ద్వారా ప్రత్యేకంగా వెబ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్లను నియమించి వివిధ శాఖలకు సహకారం అందించాలని భావిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు - కార్పొరేషన్లు - సంస్థలకు ఉన్న వెబ్‌ సైట్లను మొబైల్ ఫ్రెండ్లీగా రూపొందించడంతోపాటు సోషల్ మీడియాతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

ముఖ్యంగా ప్రభుత్వ హాస్టళ్లు - దవాఖానల వివరాలు - డబుల్ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం - కేసీఆర్ కిట్లు - మానవవనరులు - వివిధశాఖల్లో మౌలిక సదుపాయాలు - అంగన్‌ వాడీ - రేషన్‌ షాపుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనేలా రూపొందిస్తున్నారు. ప్రతిశాఖ వెబ్‌సైట్‌ను సమీక్షించడంతోపాటు రేటింగ్.. అవార్డులు ఇవ్వాలని ఐటీశాఖ భావిస్తోంది. రాబోయే ఆరునెల‌ల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నుంద‌ని స‌మాచారం.