Begin typing your search above and press return to search.

బాబుకు జంప్ జిలానీలు అలా షాకిస్తారా?

By:  Tupaki Desk   |   10 Feb 2016 4:26 AM GMT
బాబుకు జంప్ జిలానీలు అలా షాకిస్తారా?
X
ఆకర్ష.. ఆకర్ష అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జపానికి రియాక్ట్ అవుతున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఏ రేంజ్ లో కారు ఎక్కేస్తున్నారో చూస్తున్న పరిస్థితి. మాది కారు కాదు.. పుష్పకవిమానం లాంటి కారు అన్న చందంగా విపక్ష నేతల్ని లాగేసుకోవటంలో మాంచి దూకుడుగా వ్యవహరిస్తున్న అధికార టీఆర్ ఎస్ పుణ్యమా అని తాజాగా మరో టీటీడీపీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకోవటం తెలిసిందే.

పార్టీ నుంచి జంప్ అయిన వారిని ఉద్దేశించి టీతమ్ముళ్లు చేసే వ్యాఖ్యలు రెగ్యులర్ గా ఒకే విధంగా ఉంటాయి. పార్టీ నుంచి వెళ్లిపోయేవారు.. రాజీనామా చేయాలని.. ధైర్యం ఉంటే ఉప ఎన్నికల్లో తిరిగి గెలవాలంటూ సవాలు విసురుతుంటారు. ఇవాళ.. రేపటి రోజున ఎన్నికలంటే ఎంత తలకాయ నొప్పొ తెలియంది కాదు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీలు విడిచి పెట్టిన వారందరి చేత రాజీనామాలు చేయించి.. గెలిపించుకోవటాలు అంత తేలికైన పని కాదు. నిజానికి పార్టీ నుంచి జంప్ కావటం ఇవాళే పుట్టింది కాదు. ఆ మాటకు వస్తే.. టీఆర్ ఎస్ కు అలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడంటే ఇంత బలంగా కనిపిస్తున్న టీఆర్ ఎస్ కు వైఎస్ హయాంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిందో అందరికి తెలిసిందే. నాడు తనకు ఎదురైన అనుభవాల్నే.. నేడు పాఠాలుగా మార్చుకొని.. ఒకప్పుడు తాను తిన్న షాకుల్నే.. ఇప్పుడు మిగిలిన రాజకీయ పక్షాలకు ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ ఎస్ సర్కారుకు బొటాబొటి మార్కులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బలం పెంచుకోకపోతే.. ఏ రోజు ఎలాంటి పరిస్థితి ముంచుకొస్తుందోనన్న సందేహంతో బలం పెంచుకునేందుకు జంప్ జిలానీలను ప్రోత్సహించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చేపట్టిన కార్యక్రమం పుణ్యమా అని ఇప్పటివరకూ తెలంగాణ తెలుగుదేశానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కారు ఎక్కేయటం తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికల్లో టీటీడీపీ మొత్తం 15 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీ నుంచి జంప్ అయిన ఏడుగురిని మినహాయిస్తే.. ఇక ఆ పార్టీలో మిగిలింది ఎనిమిది మంది మాత్రమే. పార్టీ నుంచి జంప్ అయిన వారి చేత రాజీనామాలు చేయించి.. వారి చేత ఉప ఎన్నికలు పెట్టించాలంటూ ఆ పార్టీ డిమాండ్ చేయటంతో పాటు.. కోర్టులను ఆశ్రయించింది కూడా. ఈ నేపథ్యంలో.. ఉప ఎన్నికల చికాకు నుంచి శాశ్విత పరిష్కారంగా కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూడింట రెండు వంతుల మంది కానీ పార్టీ మారితే.. వారిని అధికారిక చీలిక సభ్యులుగా గుర్తిస్తారు. వారికి పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. తాజాగా ఆ చట్టాన్ని చుట్టంగా చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే అనర్హత గురించి అనవసరమైన లొల్లిని తగ్గించుకోవటంతో పాటు.. ఉప ఎన్నికలకు రెఢీ కావాలన్న డిమాండ్ చేసే అవకాశం లేకపోవటంతోపాటు.. విప్ జారీ చేసే వచ్చే చికాకుల నుంచి జంప్ జిలానీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ మారిన ఏడుగురికి అదనంగా మరో ముగ్గురిని కానీ పార్టీలో చేర్చుకుంటే.. మూడింట రెండు వంతుల మెజార్టీ రావటంతో పాటు ‘‘చీలిక’’ పార్టీగా అధికారిక గుర్తింపు లభించే వీలు ఉంటుంది. అప్పుడిక వారి రాజీనామాల కోసం కానీ.. ఉప ఎన్నికల కోసం కానీ డిమాండ్ చేసే అవకాశమే ఉండదు.

టీటీడీపీ నుంచి టీఆర్ ఎస్ కు జంప్ అయిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. పరకాల ఎమ్మెల్యే సీహెచ్ ధర్మారెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న.. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పార్టీలోకి వచ్చారు. ఇక.. చీలికకు అవసరమైన ముగ్గురు ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. గ్రేటర్ పరిధిలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారు ఎక్కటానికి రెఢీగా ఉన్నట్లు చెబుతున్నారు.

వీరిలో ఒకరు ప్రకాశ్ గౌడ్ గా.. మరొకరు అరికెపూడి గాంధీలన్న మాట జోరుగా వినిపిస్తోంది. మరొకరి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏమైనా.. టీటీడీపీకి సంబంధించి ఆపరేషన్ ఆకర్ష్ ..పార్టీ ‘‘చీలిక’’తో పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ నెలాఖరు లోపుల పదిమంది జంపింగ్స్ ను చీలిక వర్గంగా గుర్తించేందుకు అవసరమైన అన్నీ కార్యక్రమాలు పూర్తి అవుతాయన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. చంద్రబాబుకు తెలంగాణలో కోలుకోలేనంత షాక్ తగులుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లాన్ రెఢీ అయి.. ఇంప్లిమెంటేషనే మిగిలిందని చెప్పక తప్పదు.