కేసీఆర్ ఢిల్లీకి వెళ్లేది బాబుపై ఫిర్యాదుకేనట

Thu Jun 14 2018 11:20:22 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు ఢిల్లీ బాట పట్టారు. కే చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి తనదైన శైలిలో రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశాన్ని ఎలాగూ కేసీఆర్ తెరమీదకు తెస్తారనే సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. గురువారం ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశమవుతారని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి చెందిన పలు కీలక సమస్యలపై ప్రధానితో సీఎం చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసుచేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరుతారు. 910 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలపై కూడా ప్రధానితో చర్చిస్తారు.దీంతోపాటుగా కీలకమైన ఢిల్లీలో ఉన్న ఏపీభవన్ గురించి ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఏపీ భవన్ ప్రాంగణం అంతా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని దానిని తమకే ఇవ్వాలని ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌హౌస్‌ను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి బదులుగా ఈ భూమిని కేటాయించిందని ఈ ఆస్తి అంతా పూర్వ నిజాం ప్రభుత్వానిదేనని కేసీఆర్ వివరించనున్నారని సమచారం. ఈ మేరకు ఆ భూభాగం మొత్తం తెలంగాణకే చెందుతుందని ప్రధానికి ఈ భేటీలో సీఎం కేసీఆర్ స్పష్టంచేయనున్నారు. దీనితోపాటు మైనార్టీలకు గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కోరుతారు. తద్వారా ఏపీ సర్కారుపై ఢిల్లీ కేంద్రంగా ఒత్తిడిని పెంచనున్నారు.

మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీచేసిన తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్రం పంపించిన విషయాన్ని మరోసారి ప్రధానికి కేసీఆర్ గుర్తుచేస్తారని సమాచారం రాష్ట్రాలకు చెందిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట ప్రభుత్వాలకే ఇవ్వాలని కూడా ప్రధానిని సీఎం కేసీఆర్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం కూడా ఉన్నది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశానికి రావాలంటూ నీతిఆయోగ్ ఇప్పటికే ఆహ్వానించింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.