Begin typing your search above and press return to search.

పోలిట్ బ్యూరోలో ఉండే ఐదారు మంది ఎవరు?

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:27 AM GMT
పోలిట్ బ్యూరోలో ఉండే ఐదారు మంది ఎవరు?
X
రాజకీయ పార్టీకి పోలిట్ బ్యూరో అంటే అత్యుత్తమ స్థానం. సాధారణంగా పోలిట్ బ్యూరోలో పార్టీలో అత్యంత సీనియర్లను.. నమ్మకస్తుల్ని ఎంపిక చేసుకుంటారు. పార్టీ పోలిట్ బ్యూరోలో స్థానాన్ని అనుసరించి.. పార్టీలో సదరు నేత స్థాయి డిసైడ్ అవుతుంది. జాతీయ పార్టీలో కానీ.. ప్రాంతీయ పార్టీల్లో కానీ పోలిట్ బ్యూరోలో ఓ మోస్తరు సంఖ్యలో నేతల్ని ఎంపిక చేయటం మామూలే.

కానీ.. తెలంగాణ అధికారపక్షం.. టీఆర్ ఎస్ అధనేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. పదవుల పంపకానికి సంబంధించి తాజాగా ప్రకటన చేసిన ఆయన.. ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్.. పోలిట్ బ్యూరోలో సభ్యుల సంఖ్య ఐదారుకు మించదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీలో అత్యుత్తమమైనదిగా భావించే పోలిట్ బ్యూరోలో ఐదారుగురికే పరిమితం అనేసరికి.. ఎవరు ఉంటారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.

కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తారా? లేదంటే.. కీలక నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా? సదరు కీలక నేతలు సైతం పార్టీలో మొదటినుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందా? మధ్యలో వచ్చిన వారికి ఉంటుందా? పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన వారు ఉంటారా? అన్నవి ఆసక్తికర ప్రశ్నలుగా మారాయి. పార్టీలోని కొందరు సీనియర్ నేతల అభిప్రాయం చూస్తే.. ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు చెబుతున్నారు.

ఐదారుగురు సభ్యుల్లో కుటుంబ సభ్యులకు స్థానం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. పార్టీకి కీలకమైన మేనల్లుడు హరీశ్.. కొడుకు కేటీఆర్.. కుమార్తె కవితను కలుపుకుంటే.. కేసీఆర్ తో సహా నలుగురు అవుతారు. మొత్తం ఆరుగురిలో నలుగురు కుటుంబ సభ్యులంటే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. అలా అని మేనల్లుడికి స్థానం ఇచ్చి.. కుమారుడికి ఇవ్వకుంటే అది మరింత అసంతృప్తికి దారి తీస్తుంది. అది కూడా వర్క్ వుట్ అయ్యే పని కాదు. లేదంటే.. కుటుంబ సభ్యులెవరికి పార్టీ పోలిట్ బ్యూరోలో అవకాశం ఇవ్వకుండా ఉంటారా? అన్నది మరో ప్రశ్నగా మారింది.

ఒకవేళ ఆ వాదనే నిజమనుకుంటే.. కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లేనని చెప్పొచ్చు. తాజాగా నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీలో గ్రూపుల్ని ప్రోత్సహించవద్దని.. గెలుపునకు గ్రూపులు దెబ్బ తీస్తాయని ఉద్భోదించినట్లుగా చెప్పారంటున్న నేపథ్యంలో.. పార్టీలో గ్రూపులుండే హరీశ్.. కేటీఆర్ ఇద్దరిని పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించకుండా.. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నది పెద్ద ప్రశ్న.

ఒకవేళ అదే జరిగితే.. పోలిట్ బ్యూరోలో ఎవరెవరు ఉంటారనేదానికి కేకే.. డీఎస్.. నాయిని.. తుమ్మల.. ఈటెలకు స్థానం లభించొచ్చని చెబుతున్నారు. మరి.. సొంతోళ్లను వదిలేసి.. బయటవాళ్లకు పెద్ద పీట వేస్తారా? ఆ సాహసం కేసీఆర్ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికర వాదనగా చెబుతున్నారు. మొత్తానికి ఐదారుగురితో పోలిట్ బ్యూరో అన్నది కత్తి మీద సాము లాంటిదిగా అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ లాంటి నేతకు ఇలాంటివి ఒక లెక్కా..?