Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచలనం.. కాంగ్రెస్ నేతలకు షాక్

By:  Tupaki Desk   |   14 Aug 2018 6:53 AM GMT
కేసీఆర్ సంచలనం.. కాంగ్రెస్ నేతలకు షాక్
X
గడిచిన 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం ఉత్తర తెలంగాణనే.. ఆదిలాబాద్ - కరీంనగర్ - నిజామాబాద్ - వరంగల్ - మెదక్.. ఈ ఐదు జిల్లాల్లో కేసీఆర్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసి 62 సీట్లు తెచ్చుకున్నారు. దక్షిణ తెలంగాణలో మాత్రం కేసీఆర్ తేలిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ ఎస్ కేవలం ఒక్కటంటే ఒక్క సీటే గెలుచుకుంది. రంగారెడ్డి - మహబూబ్ నగర్ - హైదరాబాద్ లో టీఆర్ ఎస్ తేలిపోయింది. ఖమ్మంలోనూ ఆశించిన ఫలితం రాలేదు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో గెలిచిన జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు.

నల్గొండ జిల్లా ఆది నుంచి కాంగ్రెస్ కు బలమైన సపోర్టుగా ఉంది. ఈ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి - జానారెడ్డి - కోమటిరెడ్డి బ్రదర్స్ - రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి భీకర కాంగ్రెస్ నేతలంతా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిని ఎదుర్కోవడం జగదీష్ రెడ్డి వల్ల కావడం లేదట..అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు తన ప్లాన్ బిని అమలు చేయబోతున్నట్టు టీఆర్ ఎస్ వర్గాల నుంచి సమాచారం.

బలమైన చోటు ఎలాగూ గెలుస్తారు.. అదే బలహీనంగా ఉండే చోట నిలబడితే అక్కడ పార్టీకి ఊపు వస్తుంది.కాస్త బలం పెరుగుతుంది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని అమలు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలో టీఆర్ ఎస్ కు ఉన్న సానుకూల వాతావరణాన్ని దక్షిణ తెలంగాణలోనూ విస్తరించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. అందుకే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు దక్షిణ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కేసీఆర్ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎలాగైనా సరే ఇక్కడ పోటికి దిగితే ఆ ఊపు మొత్తం జిల్లాపై పనిచేసి టీఆర్ ఎస్ శక్తి పుంజుకుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. దిగ్గజ కాంగ్రెస్ నేతలను ప్రభావితం చేసేందుకు కేసీఆర్ ఏకంగా నల్గొండ జిల్లా లోని ఏదైనా నియోజకవర్గంలో బరిలో నిలువబోతున్నాడనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.