Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు మాజీ మంత్రుల‌పై కేసీఆర్ వ‌ల వేశారా?

By:  Tupaki Desk   |   13 Oct 2017 12:18 PM GMT
ఆ ఇద్ద‌రు మాజీ మంత్రుల‌పై కేసీఆర్ వ‌ల వేశారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మూడో ద‌శ‌కు శ్రీ‌కారం చుట్టారా? ఈ క్ర‌మంలో కొత్త కాన్సెప్ట్‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారా? ఇన్నాళ్లు ప్ర‌తిపక్ష టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ల‌క్ష్యంగా సాగిన ఈ ఎత్తుగ‌డ‌ ఇపుడు రూటుమారి సీనియ‌ర్ నేత‌ల‌పై ప‌డిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇప్ప‌టికే ఇందులో ప్రాథ‌మిక ద‌శ‌ను పూర్తిచేసిన కేసీఆర్ త్వ‌ర‌లో ఆ జోరు పెంచ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆకర్ష్ ఎత్తుగ‌డ‌తో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని విధంగా కేసీఆర్ దెబ్బతీశారు. టీడీపీ లాగానే కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేక నజర్ పెట్టిన కేసీఆర్ ఆ మేరకు కొంత విజయం సాధించారు. అయితే పూర్తి స్థాయిలో తగిన ఫలితం రాకపోవడంతో కొత్త రూట్‌ లోకి దాన్ని మ‌ల్చారు.

తొలుత టీడీపీని టార్గెట్‌ చేసిన టీఆర్‌ ఎస్‌ నేతలు ఆ తరువాత తమ దృష్టిని కాంగ్రెస్‌ వైపు మళ్లించ‌డంతో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎమ్మెల్యేల‌పై కాకుండా పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌పై దృష్టి సారించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌ధానంగా నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ కు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ కు బలమైన నేతలు దామోదర రాజనర్సింహ - సునితా లక్ష్మారెడ్డితో టీఆర్ ఎస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దామోదర మాత్రం టీఆర్‌ ఎస్‌ కు కొన్ని డిమాండ్స్‌ వినిపిస్తున్నట్టు సమాచారం. తన వర్గానికి చెందిన కొంతమందికి ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలనేది దామోదర వినిపిస్తోన్న డిమాండ్‌. ఇక మాజీమంత్రి ప్రసాద్‌ కుమార్‌ తోనూ టీఆర్‌ ఎస్‌ నేతలు టచ్‌ లో ఉన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ - బీజేపీ నేతలు కూడా అధికార పార్టీ నేతలతో టచ్‌ లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బలమైన నేతలను కారు ఎక్కించుకునేందుకు గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు.

తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి రావాలంటూ అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ కు ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. గ్రామ స్థాయి నాయకుల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలన్న భేదం లేకుండా ఒకరి వెంట మరొకరు క్యూ కట్టారు. విపక్ష ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు కార‌ణాలు ఏమైనా...తామంతా కేసీఆర్ పాలన నచ్చే అధికారపార్టీలో చేరుతున్న ట్లుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు అధికార పార్టీలో చేరిపోవ‌డంతో ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌ కు - విప‌క్ష‌మైన టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది. కేసీఆర్ తాజా ప్ర‌ణాళిక‌ను విప‌క్షాలు ఎలా ఎదుర్కుంటాయో చూడాలి మ‌రి.