Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను ఖ‌తం చేసుడే కేసీఆర్ లక్ష్య‌మా?

By:  Tupaki Desk   |   15 March 2019 4:30 AM GMT
కాంగ్రెస్ ను ఖ‌తం చేసుడే కేసీఆర్ లక్ష్య‌మా?
X
రాజ‌కీయంగా చోటు చేసుకునే ప్ర‌తి ప‌రిణం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఖ‌తం ప‌ట్టించేలా కేసీఆర్ చేస్తున్న దీక్ష రానున్న రోజుల్లో మ‌రింత జోరు కానున్న‌ట్లు చెబుతున్నారు. ఇంత‌కీ.. కాంగ్రెస్ ను కేసీఆర్ ఎందుకు ఖ‌తం ప‌ట్టించాల‌ని భావిస్తున్న‌ట్లు? ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన నాటి నుంచి వ‌ల‌స‌ల్ని ప్రోత్స‌హిస్తున్న కేసీఆర్ అంతి లక్ష్యం ఏమిటి?

ఆయ‌న దేన్ని టార్గెట్ గా పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు? దాని వెనుకున్న వ్యూహ‌మేంది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేస్తే.. షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్న మాట వినిపిస్తోంది. తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 19 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించింది.

ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ కారు ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు. రానున్న రోజుల్లో మ‌రో ఏడుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి వెళ్ల‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎందుకిలా అంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసే నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదా మిస్ కావ‌ట‌మే కాదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో అత్య‌ధికులు క‌లిసి టీఆర్ ఎస్ ఎల్పీలోకి సీఎల్పీని విలీనం చేయించాల‌నికేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఎందుకిలా? అంటే దానికో బ‌ల‌మైన కార‌ణం ఉందంటున్నారు. ఒక‌వేళ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వ‌చ్చి.. కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరితే త‌న‌కు ముప్పు అని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప‌లితాలు వ‌చ్చే నాటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక‌లు పూర్తి అయి.. తెలంగాణ‌లో ఆ పార్టీని ఖ‌తం ప‌ట్టిస్తే.. త‌నకిక తిరుగులేద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ కార‌ణంతోనే.. వ‌ల‌స‌ల్ని ప్రోత్స‌హించ‌ట‌మే కాదు..టీ కాంగ్రెస్ పార్టీని టీఆర్ ఎస్ లోకి విలీనం చేసుకోవ‌టం ద్వారా శ‌త్రుసంహారం పూర్తి చేయాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకోసం షురూ చేసిన ఆప‌రేష‌న్ మే 23 కంటే ముందే ముగియాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఒక‌వేళ‌.. విలీనం సాధ్యం కాని ప‌క్షంలో మెజార్టీ జంపింగ్స్ ను త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ప్లాన్ బిని కూడా సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా టీ కాంగ్రెస్ ఉనికి రానున్న రోజుల్లో తెలంగాణ‌లో క‌నిపించ‌కూడ‌ద‌న్న కేసీఆర్ క‌ల ఎంత‌వ‌ర‌కు తీరుతుందో కాల‌మే స‌మాధానం చెప్పాలి.