కేసీఆర్ వరాల వెనుక అర్థం.. పరమార్థం..

Thu May 17 2018 10:02:13 GMT+0530 (IST)

బోళా శంకరుడి తరహాలో కోరిన వారందరికీ సీఎం కేసీఆర్ వరాలిచ్చేస్తున్నారు.. కానీ ఆ శివుడు తర్వాత పరిణామాలను ఊహించక అభయమిస్తుంటాడు. కానీ కేసీఆర్ మాత్రం ఒక సమస్య రాకమునుపే దాని వల్ల ఎంత ప్రయోజనం ఉందని తెలిసి అడుగులు వేస్తుంటాడు.. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక అర్థం.. పరమార్థం ఉంటుందని ఆయన్ను సన్నిహితంగా గమనిస్తున్న టీఆర్ ఎస్ ముఖ్యులు అంటున్నారు..నిన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షించారు. సమావేశం ముగిసిన అనంతరం ఉద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇంతలా ప్రజలకు చేరువ కావడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని .. వారికి ఎంత ఇచ్చినా తక్కువే అంటూ పీఆర్సీ వేశారు. జీతాలు కూడా భారీగా పెంచేందుకు అంగీకరించారు.

అయితే దీని వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రస్తుతం కేసీఆర్ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో మొదలు పెట్టిన రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా ఆకర్షించింది. రైతులకు పంట పెట్టుబడిగా 4వేలు ఇస్తుండడంతో వారంతా ఖుషీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ కు ఈ పథకం ఓట్ల వర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ ఎన్ని పథకాలు పెట్టినా అంతిమంగా ప్రజలకు చేరువ చేయాల్సింది అధికారులే.. ఈ క్రమంలోనే ఇటీవల ఉద్యోగులు పీఆర్సీ కోసం పోరుబాట పట్టారు. ఉపాధ్యాయులు పింఛన్ సమస్యపై సమ్మెకు దిగుతామంటున్నారు. వీరంతా ఎదురుతిరిగితే 2019 ఎన్నికల్లో గట్టెక్కడం అంతా ఈజీ కాదు. అందుకే చాకచక్యంగా కేసీఆర్ ఉద్యోగులను మచ్చిక చేసుకోవడానికి సమావేశమై వారి కోరికలు తీర్చారు. ఇలా అన్నింటిని చక్కదిద్దుతూ కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.