Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘కల’ కూడా పట్టలేదా?

By:  Tupaki Desk   |   24 July 2016 6:29 AM GMT
కేసీఆర్ ‘కల’ కూడా పట్టలేదా?
X
సుబ్బరంగా ఉన్న దాన్ని చేతులారా నాశనం చేసుకోవటం.. అంతా కాలిపోయిన తర్వాత. మళ్లీ మొదటి నుంచి పని మొదలెట్టటం మనకు మామూలే. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకునే నాథుడే లేని దుస్థితి. విజన్ ఉన్న నాయకత్వం లేని పాలనలో ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల పుణ్యమా అని పర్యావరణ పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవస్థలో మార్పు కోసం ఉద్యమ స్థాయిలో ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం వచ్చింది.

పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించేందుకు వీలుగా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని తెలంగాణ.. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరు చూస్తే.. ఆంధ్రాతో పోలిస్తే.. తెలంగాణలోనే ఉధృతంగా సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొక్కల్ని నాటాలన్న లక్ష్యాన్ని చేపట్టిన కేసీఆర్.. తన ప్లాన్ కు తగ్గట్లే పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారు. హరిత హారం పేరిట షురూ చేసిన ఈ కార్యక్రమం మొదలు పెట్టి 16 రోజులు కాగా.. ఇప్పటివరకూ తెలంగాణ వ్యాప్తంగా 14 కోట్ల మొక్కల్ని నాటారు. మరోరెండు రోజుల్లో మరో రెండు కోట్లను నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

ఈ అంకెల్ని విన్నప్పుడు ఇంత భారీ స్థాయిలో మొక్కల్ని నాటుతున్నారా? అంటే.. అవుననే చెప్పాలి. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో పాటు.. సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని.. మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా అధికారుల పని తీరును తేలుస్తామని చెప్పటంతో ఈ వ్యవహారంపై అధికారులు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు.

మొక్కలు నాటే కార్యక్రమం అధికారులకు మాత్రమే కాదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడో పరీక్షగా మారిన పరిస్థితి. మొక్కల్ని నాటే విషయంలో ఎక్కడైనా తప్పులు జరిగితే దానికి బాధ్యత అధికారులతో పాటు.. అధికారపక్ష నేతల్ని సైతం బాధ్యుల్ని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమంపై మరింత ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా భారీగా చేపట్టినా.. నిజామాబాద్ జిల్లాలో భారీగా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పాలి. ఈ ఒక్క జిల్లాలో అత్యధికంగా 2.27 కోట్ల మొక్కల్ని నాటగా.. తర్వాతి స్థానంలోఅదిలాబాద్ నిలిచింది. ఈ జిల్లాలో 2.03కోట్ల మొక్కల్ని నాటగా.. జీహెచ్ ఎంసీ పరిధిలో కేవలం 29.3 లక్షల మొక్కల్ని మాత్రమే నాటటం గమనార్హం. ఇక.. తెలంగాణరాష్ట్రంలో చెట్ల నాటే కార్యక్రమంలో భారీ టార్గెట్ పెట్టి.. మిగిలిన జిల్లాలతోపోలిస్తే భారీగా మొక్కలు నాటాలంటూ నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ టార్గెట్ పెట్టినా ఆయన ఆకాంక్ష పెద్దగా నెరవేరలేదేనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ జిల్లాలో ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారమే 1.26 కోట్ల మొక్కల్ని నాటినట్లుగా చెబుతున్నారు. అత్యధికంగా మొక్కలు నాటిన జిల్లాల్లో నల్గొండ ఐదో స్థానంలో నిలవటం చూసినప్పుడు తెలంగాణ అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కలను కూడా లైట్ గా తీసుకున్నారన్న భావన కలగటం ఖాయం.