Begin typing your search above and press return to search.

అందరినీ కారులోకి ఎక్కించుడే టార్గెట్

By:  Tupaki Desk   |   24 Oct 2016 10:16 AM GMT
అందరినీ కారులోకి ఎక్కించుడే టార్గెట్
X
తాను వేసే ప్రతి అడుగును వ్యూహాత్మకంగా వేసే అతి కొద్ది రాజకీయ అధినేతల్లో టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ఎంతోకొంత మర్మం ఉంటుంది. ప్రతి అంశంపై లోతుగా అధ్యయనం చేయటం.. కసరత్తు చేసిన తర్వాతే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. ఈ సందర్భంలోనూ వాతావరణం తనకు అనుకూలంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని చూసుకొని మాత్రమే పెదవి విప్పే పరిస్థితి. మిగిలిన రాజకీయ నేతలకు కేసీఆర్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. తన మాటలతో వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఆయన సొంతం.

అలాంటి కేసీఆర్ ఇటీవల కాలంలో అనుసరిస్తున్న వ్యూహంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ దసరాను మర్చిపోలేని అనుభవంగా మిగిల్చిన కేసీఆర్.. తాజాగా దీపావళి సందర్భంగా పదవుల పంపిణీతో పార్టీ నేతల్లో సంబరాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పదవుల పంపకంలో ఎవరికి పెద్దపీట అన్న మాటకొస్తే.. విధేయులకే అన్న మాట వినిపించటం కామన్. కానీ.. కేసీఆర్ రూటు కాస్త సపరేటు. అందుకే.. విధేయులకే కాదు అస్మదీయులకు కూడా పదవుల్ని ఇవ్వ‌టం ద్వారా.. వారి మనసుల్లో ప్రభుత్వం పట్ల.. టీఆర్ ఎస్ పట్ల సానుకూల ధృక్ఫథం ఏర్పడేలా చేయటం గమనార్హం.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తీరును తప్పుపట్టిన వారు చాలామందే ఉన్నారు. కేసీఆర్ కు దూరంగా తమ పని తాము చేసుకుంటూ.. ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాల్ని పన్నిన పలువురిని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కీలకమైన పదవులు ఇవ్వటం ద్వారా.. సొంత పార్టీ నేతలతోపాటు.. తనను విబేదించిన వారి మనసుల్ని దోచుకున్నారని చెప్పాలి. దీనికి టీఎస్సీపీఎస్సీ ఛైర్మన్ గా ఎంపిక చేసిన ఘంటా చక్రపాణి ముచ్చట కానీ.. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా నియమితులైన మల్లేపల్లి లక్ష్య్మయ్య కావొచ్చు.. తాజాగా బీసీ కమిషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టిన బీఎస్ రాములు కావొచ్చు.. వీరంతా కేసీఆర్ ఏదో సందర్భంలో వ్యతిరేకించిన వారే.

తాను కలలుకంటున్న బంగారు తెలంగాణ సాధనకు.. అభిప్రాయ బేధాలతో పని లేదని.. సమర్థతకు మాత్రమే తాను చోటిస్తానన్న సందేశాన్ని కేసీఆర్ తన చేతల్లో చేసి చూపించారని చెప్పొచ్చు.

తన మీద అభిమానంతో..రాజకీయంగా తమ ఎదుగుదలకు టీఆర్ ఎస్ సరిపోతుందని వివిధ పార్టీలనుంచి జంప్ అయి వచ్చిన నేతలతో పాటు.. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నెంటే ఉన్న వారిని.. ఇలా అందరిని కలుపుకుపోయే ఒక విలక్షణమైన కాంబినేషన్ ను కేసీఆర్ నడిపిస్తున్నట్లుగా చెప్పొచ్చు.కేసీఆర్ వ్యూహం చూస్తే.. పదునైన విమర్శలు సంధించే అవకాశం ఉన్న మేధావులకు కీలక బాధ్యతలు అప్పగించటం.. వివిధ పార్టీల్లో బలంగా ఉన్న నేతలకు టీఆర్ ఎస్ లోకి తీసుకొచ్చి పదవులు ఇవ్వ‌డంతో పాటు.. సొంత పార్టీకి చెందిన నేతలకు.. కష్టించి పని చేస్తే పదవులు మీవే అన్న రీతిలో సంకేతాలు ఇస్తున్న కేసీఆర్ వైనం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే.. టీఆర్ ఎస్ అందరిదన్న భావనతో పాటు.. కారులో ఎవరైనా ఎక్కొచ్చన్న సంకేతాన్ని.. సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చేతల్లో చేసి చూపిస్తున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/