Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు మినిస్ట్రీ రాదా.? హరీష్ కీరోలా.?

By:  Tupaki Desk   |   15 Dec 2018 4:26 AM GMT
కేటీఆర్ కు మినిస్ట్రీ రాదా.? హరీష్ కీరోలా.?
X
గులాబీ దళపతి - సీఎం కేసీఆర్ ఏదీ చేసినా చాలా పకడ్బందీగా చేస్తారు. అన్ని సానుకూలంగా ఉన్నాయనుకుంటేనే అమలు చేస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించి తిరుగులేకుండా ఉన్న పార్టీ.. హైదరాబాద్ లో మెజార్టీ సీట్లు సాధించిపెట్టిన కేటీఆర్ ప్రమోషన్ కు ఇంతకుమించిన సమయం లేదని భావించి పార్టీ పగ్గాలను కేసీఆర్ అప్పగించారు. తన తర్వాత అన్నీ కేటీఆర్ అని స్పష్టం చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుంది. అదే ఇప్పుడు జోష్ లో తీసుకుంటే ఎవ్వరూ అడ్డుచెప్పే సాహసం చేయరు. దీన్నే కేసీఆర్ పక్కాగా అమలు చేశారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మంత్రి కేటీఆర్ కు పంచాయతీ - లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు కూడా మంత్రి పదవి ఇవ్వరనే టాక్ వినిపిస్తోంది. ఆ రెండు ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను కేటీఆర్ భుజాలపై పెట్టేందుకు కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. ఆ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు కీలక పదవులు అన్నీ అనుకున్నట్టు అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదే సమయంలో మంత్రి హరీష్ రావుకు మంత్రివర్గంలో కీరోల్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. కొడుకు కేటీఆర్ కు అందలం ఇచ్చి బలమైన - సమర్ధుడైన ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు అన్యాయం జరిగిందనే వాదనలకు ఆస్కారం లేకుండా మంత్రివర్గంలో కీలక శాఖలు - అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.అల్లుడిని కూడా ఎక్కడా తగ్గకుండా చూడాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈసారి సెంటిమెంట్లకు ఆస్కారం లేకుండా ఎవరి ఒత్తిడులకు తలొగ్గకుండా మైనార్టీ - ఎస్సీ కేటగిరిలను మేనేజ్ చేస్తూనే కష్టపడ్డ హరీష్ రావు లాంటి వాళ్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.