Begin typing your search above and press return to search.

ఆ జిల్లాల‌కు పేరు మార్చ‌నున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:50 AM GMT
ఆ జిల్లాల‌కు పేరు మార్చ‌నున్న కేసీఆర్
X
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వ‌రంగ‌ల్ గ్రామీణ‌.. నగ‌ర జిల్లాలుగా ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. 2016 ద‌స‌రా నుంచి కొత్త జిల్లాలు ఆవిర్భ‌వించాయి. అయితే.. పాల‌నాప‌రమైన త‌ల‌నొప్పులు ఎదుర‌వుతున్న‌వేళ‌.. రెండు జిల్లాల‌కు సంబంధించిన అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. రెండు జిల్లాల‌కు చెందిన నేత‌ల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. ఈ రెండు జిల్లాల స్వ‌రూపంతో పాటు.. పేర్ల‌ను కూడా మార్చాల‌ని డిసైడ్ అయ్యారు.

కేసీఆర్ తాజా నిర్ణ‌యంతో రెండు జిల్లాల రూపురేఖ‌లు మార‌నున్నాయి. పేర్ల విష‌యానికి వ‌స్తే ఇప్పుడున్న వ‌రంగ‌ల్ రూర‌ల్.. అర్బ‌న్ స్థానే.. వ‌రంగ‌ల్.. హ‌న్మ‌కొండ జిల్లాలుగా మార‌నున్నాయి. అంతేకాదు.. ఈ జిల్లాల స‌రిహ‌ద్దుల్ని కూడా మార్చాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నారు.

తాజాగా తెర మీద‌కు వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ను చూస్తే.. వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా ప‌రిధిలోకి వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్ని క‌లిపి.. దాన్ని జిల్లా కేంద్రంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక రూర‌ల్ జిల్లా విష‌యానికి వ‌స్తే వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాన్ని క‌ల‌పాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు స్థానిక నేత‌లు ఓకే చేశారు.

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా విష‌యానికి వ‌స్తే వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌టే పూర్తిస్థాయిలో ఉండ‌నుంది. స్టేష‌న్ ఘ‌న్ పూర్.. హుజురాబాద్.. హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లోకొంత భాగం ఉండ‌నుంది. న‌గ‌ర జిల్లాను స‌ర్దుబాటు చేయ‌టానికి వీలుగా వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలో నుంచి ఏదైనా మండ‌లాన్ని క‌లిపేందుకు అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌టంతో..వ‌రంగ‌ల్ రూర‌ల్.. అర్బ‌న్ జిల్లాల రూపురేఖ‌ల‌తో పాటు.. పేర్లు మార్చే దిశ‌గా ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.