Begin typing your search above and press return to search.

వైఎస్ కే సాధ్యం కానిది కేసీఆర్ కు సాధ్యమైంది

By:  Tupaki Desk   |   12 Feb 2016 11:30 AM GMT
వైఎస్ కే సాధ్యం కానిది కేసీఆర్ కు సాధ్యమైంది
X
వివిధ రంగాల్లో ప్రత్యర్థులు మామూలే. కానీ.. రాజకీయాల్లో ప్రత్యర్థుల కారణంగా జరిగే నష్టం భారీగా ఉంటుంది. అలాంటప్పుడు వారిని దెబ్బ తీయటం.. కోలుకోకుండా చేయటానికి ఏం చేయాలి? అన్న ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన నేతగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చెప్పుకోవచ్చు. తాను బలపడటం కోసం ప్రత్యర్థుల్ని బలి పెట్టేందుకు ఏ మాత్రం మొహమాట పడేవారు కాదు. ప్రత్యర్థుల పట్ల కర్కసంగా వ్యవహరించటం.. అదే సమయంలో.. తనను ఆశ్రయం కోరే వారి పట్ల అంతులేని దయాగుణాన్ని కలిగి ఉండటంతో పాటు.. విలువలు లాంటి పదాల్ని కాస్త దూరంగా ఉంచే వైఎస్.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజకీయాల్లో సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారు.

ఎన్నికల్లో ఓడిన పార్టీ విపక్షంగా మారి.. అధికారపక్షం చేసే పనుల్ని నిశితంగా గమనిస్తూ.. వారిని ఇరుకున పెట్టటం.. వారి తప్పుల్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అధికారపక్షానికి చెక్ పాయింట్ లా వ్యవహరించే ఇలాంటి విపక్షాలు వైఎస్ కు చిరాకు పుట్టించటంతో పాటు.. ఈ రోజుకు పరిమిత బలంగా ఉన్న విపక్షం రేపటి రోజు మరింత బలోపేతం అయ్యేలా తానెందుకు చూస్తూ ఉండాలని అనుకున్నారేమో కానీ.. ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేశారు.

అందులో భాగంగా 2009 ఎన్నికల అనంతరం.. తన ఆపరేషన్ ను మరింత వేగవంతం చేసిన వైఎస్.. టీఆర్ ఎస్ తో పాటు.. తెలుగుదేశం పార్టీల్ని దెబ్బ తీయాలని.. అవి కోలుకోకుండా ఉండేలా చేయాలని భావించారు. తాను తప్ప మరెవరికీ రాజకీయంగా భవిష్యత్తు లేదన్న వాతావరణాన్ని సృష్టించే విషయంలో వైఎస్ అప్పట్లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు విపక్షాలు వణికిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎవరికి కొరుకుడుపడని అధినేతగా కనిపిస్తున్న కేసీఆర్ సైతం.. అప్పట్లో వైఎస్ దెబ్బకు కుదేలయ్యారు.

అయితే.. అనుకోని విధంగా ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు కావటంతో.. ఆయన స్థాయిలో ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహించే సత్తా ఎవరికి లేదన్న అభిప్రాయం ఉండేది. వైఎస్ సమకాలీన నేత అయిన చంద్రబాబు మైండ్ సెట్ కాస్తంత భిన్నంగా ఉండే నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ అస్త్ర ప్రయోగం జరిగే అవకాశం లేదని భావించే వారు. కాకుంటే.. వైఎస్ కుమారుడు జగన్.. తన తండ్రి మొదలెట్టిన కార్యక్రమాన్ని కొంతమేర చేసినా అది అరకొరగానే మిగిలిందని చెప్పాలి. అయితే.. ఎవరూ ఊహించని విధంగా వైఎస్ షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ ను.. కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేసే వరకూ వెళ్లటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వైఎస్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ కు తీవ్రంగా విలవిలలాడిన కేసీఆరే.. ఈ రోజు ఆ అస్త్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించటమే కాదు.. వైఎస్ నాడు ఏమనుకున్నారో.. దాన్నే కేసీఆర్ పూర్తి చేస్తుండటం విశేషం. తాజాగా టీటీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.