Begin typing your search above and press return to search.

వామ్మో కేసీఆర్‌.. ఎమ్మెస్సీలో పొలిటిక‌ల్ సైన్స్!

By:  Tupaki Desk   |   16 Oct 2018 4:48 AM GMT
వామ్మో కేసీఆర్‌.. ఎమ్మెస్సీలో పొలిటిక‌ల్ సైన్స్!
X
బీకాంలో ఫిజిక్స్.. ఈ మాట తెలుగు ప్ర‌జ‌ల్ని ఎంత కామెడీ చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాను బీకాం చ‌దివేట‌ప్పుడు ఫిజిక్స్ చ‌దువుకున్న‌ట్లు ఏపీ ఎమ్మెల్యే.. తెలుగు త‌మ్ముడు జ‌లీల్ ఖాన్ చెప్పిన మాట‌లు ఆయ‌న్ను ఓవ‌ర్ నైట్ ఇంట‌ర్నెట్ స్టార్ గా చేశాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అలాంటి జ‌లీల్ ఖాన్ మాట‌ల్ని త‌ల‌పించేలా తెలంగాణ రాష్ట్ర అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన ఒక మాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. మ‌హా ఎట‌కారంగా మారింది.

కేసీఆర్ అన్నంత‌నే నిప్పులు చెరిగే మాట‌లు.. ఎట‌కారానికి మ‌రింత కారం క‌లిసేలా మాట్లాడ‌టం ఆయ‌న‌కు అల‌వాటే. అలాంటి కేసీఆర్ నోట వెంట ఇంత కామెడీ మాట రావ‌టం ఇదే తొలిసారేమో. మాటల మాంత్రికుడిగా ఆయ‌న‌కున్న పేరు ప్ర‌ఖ్యాతుల‌న్ని ఒక్క‌సారి మూట‌గ‌ట్టి గోదాట్లో క‌లిపేలా ఆయ‌న మాట ఉంద‌ని చెబుతున్నారు.

కేసీఆర్ అంత‌టి విష‌యం ఉన్న అధినేత‌లు తెలుగునేల మీద భూత‌ద్దం వేసుకొని వెతికినా ఒక‌రిద్ద‌రు కూడా ఉండ‌రంటూ చెప్పే అతిశ‌యం మాట‌ల‌కు భిన్నంగా కేసీఆర్ మాట ఉండ‌టంతో ఇప్పుడు కామెడీగా మారింది. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన ఎమ్మెస్సీలో పొలిటిక‌ల్ సైన్స్ మాట ఇప్పుడు చిట్టిపొట్టి వీడియోలతో తెగ వైర‌ల్ అవుతోంది. అంతేనా.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న్నువిప‌రీతంగా ట్రోల్ అయ్యేలా చేస్తోంది.

కేసీఆర్ నోటి నుంచి ఆణిముత్యం లాంటి మాట‌ను సింఫుల్ గా క‌ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి.. విశ్వ‌వ్యాప్త ప్ర‌చారానికి తెర తీసింది. స్వ‌ర్గీయ వెంక‌ట‌స్వామి సంస్మ‌ర‌ణ స‌భ‌ను నిర్వ‌హించ‌గా అందులో పాల్గొన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివే టైంలో అంటూ చెప్పిన మాట ఇప్పుడు య‌మా కామెడీగా మారింది.

ఇంత కామెడీ కావ‌టానికి కార‌ణం.. ఎమ్మెస్సీలో పొలిటిక‌ల్ సైన్స్ లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ విద్యార్హ‌త‌ల గురించి గూగుల్ చేసిన‌ప్పుడు వికీలో ఆయ‌న ఎంఏ తెలుగు లిట‌రేచ‌ర్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది. మ‌రి.. ఎంఏ తెలుగు లిట్ కాస్తా.. ఎమ్మెస్సీ పొలిటిక‌ల్ సైన్స్ ఎలా చేశాడ‌బ్బా? అన్న‌ది ప్ర‌శ్న‌. వినేవాడు ఉంటే చెప్పేటోడు చెల‌రేగిపోతుంటార‌న్న చందంగా కేసీఆర్ సైతం ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్నార‌ని.. అందుకు తాజా మాటే నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డుతున్నారు.

ఇక‌.. ఎమ్మెస్సీలో పొలిటిక‌ల్ సైన్స్ అనే కోర్సు ఈ భూప్ర‌పంచంలో ఉందా? అన్న‌ది గూగుల్ చేస్తే.. అలాంటి కోర్సులు ప్రాశ్చాత్య దేశాల్లో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తుంది. ప్ర‌పంచం దాకా ఎందుకు కేసీఆర్ చ‌దివిన ఉస్మానియా ముచ్చ‌టే తీసుకుంటే మాత్రం ఆ విశ్వ‌విద్యాల‌యంలో మాత్రం ఎమ్మెస్సీలో పొలిటిక‌ల్ సైన్స్ కోర్సు మాత్రం లేదు. అయినా.. ఎంఏ చ‌దివి.. ఎమ్మెస్సీ చ‌దివిన రోజుల్లో అంటూ ఈ మాట‌లేంది కేసీఆర్ సారూ.. మీ మీద ఎంత అభిమానం పెట్టుకున్నాం.. మా ఇజ్జ‌త్ తీసేలా మాట్లాడితే.. మా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ఏమ‌ని చెప్పాలంటూ గులాబీ కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు త‌మ వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌ల్లో తెగ ఇదైపోతున్నారట‌.