Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పిన ‘కుక్క తోక’ కథ..

By:  Tupaki Desk   |   20 July 2019 4:19 AM GMT
కేసీఆర్ చెప్పిన ‘కుక్క తోక’ కథ..
X
తెలంగాణ అసెంబ్లీలో నూతన మున్సిపల్ చట్టాన్ని తెలంగాణ సీఎం కేసీఆరే స్వయంగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అందులోని ప్రతి వ్యాఖ్యాన్ని తాను రాసిందేనని.. ప్రజల కష్టాలు తీర్చేందుకు కఠిన చట్టాలు రూపొందించానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా కొత్తగా రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ కోవలోనే వీఆర్వోల అవినీతి ఏ స్థాయిలో ఉందో ఒక ప్రభుత్వ అధినేతగా కళ్లకు కట్టినట్టు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

నిజానికి మున్సిపల్ చట్టంలోని పలు కఠిన నిబంధనలను ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం, ఇతర నేతలు అభ్యంతరం తెలుపాలని చూశారట.. కానీ కేసీఆర్ ఇచ్చిన వివరణ చూశాక మధ్యాహ్నంలోపే ఆమోదం పొంది సభ వాయిదా పడడం విశేషంగా మారింది.

రెవెన్యూ కొత్త చట్టం సందర్భంగా వీఆర్వోల ఆగడాలపై కేసీఆర్ చెప్పిన ‘కుక్క తోక’ కథ అందరినీ ఆలోచింప చేసింది. వీఆర్వోలు నా భూమిని హోంమంత్రి మహమూద్ అలీకి.. ఆయన భూమిని ఈటెల రాజేందర్ కు మార్చే సమర్థులన్నారు. సీఎంకు, సీఎస్ కు లేని అధికారాలు వీఆర్వోకు ఉన్నాయని.. అందుకే ఈ విచ్చలవిడి అవినీతి జరుగుతోందన్నారు. 5 ఎకరాలుంటే మూడు ఎకరాలు.. మూడు ఎకరాలుంటే 5 ఎకరాలు మార్చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ కొత్త చట్టంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంటే రెవెన్యూ ఉద్యోగులంతా సమ్మె చేస్తామంటున్నారని.. వాళ్లు చెప్పినట్టు శాసనసభ, సీఎం వినాలా అని ఫైర్ అయ్యారు. ఈ కోవలోనే ‘కుక్క తోకను ఊపుతుందా.. తోక కుక్కను ఊపుతుందా’ అని వీఆర్వోల ఆగడాలను ఊదహరిస్తూ కామెంట్ చేశారు. ఈ డైలాగ్ తో నిండు సభ ఘోల్లుమంది.

చట్టాలను రూపొందించడమే కాదు.. వ్యతిరేకించే వారిని మరో మాట రాకుండా చేయడంలో కేసీఆర్ భాష పటిమ.. ఒప్పించే తీరు వేరే ఎవరికి లేదనడానికి ఈ కథ నిదర్శనమని అసెంబ్లీ లాబీల్లో గులాబీ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.