Begin typing your search above and press return to search.

ఆ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   17 Jan 2018 8:13 AM GMT
ఆ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టేసిన కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు క్షేత్రస్థాయి పర్యటనకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వస్తోన్న సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటన నేటి నుంచి మొద‌లవుతోంది. సంక్రాంతి పండుగ నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు. క్షేత్ర స్థాయి పర్యటనకు ఆయన ఒక క్లారిటీ కి వచ్చారని విశ్వసనీయ వర్గాల స‌మాచారం. త‌న సొంత ఇలాకా అయిన సిద్ధిపేట‌ నుంచే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించ‌నున్నారు. సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటనకు రూట్‌ క్లియర్‌ కావడానికి అనేక కార‌ణాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువడం - రైతుల‌కు 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ అందించ‌డం ప్రధాన కారణంగా తెలుస్తోంది.

వాస్త‌వానికి గ‌త ఏడాది మార్చి నుంచి కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌నపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. గ‌త మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ముగియగానే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తానని - ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజులు మకాం వేసి అక్కడే ఆ జిల్లా అభివృద్ధిపై అధికారులు - ప్రజాప్రతినిధులతో సమీక్షంచడమే కాకుండా ఆ జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానని సీఎం కేసీఆరే స్వయంగా చెప్పారు. అయితే, ఆ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఆ టూర్ మొద‌లైంది.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటింది. పాలనా పరంగా సీఎం కేసీఆర్‌ అందరి మన్ననల్ని పొందుతున్నారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సరికొత్త పథకాలతో ప్రజల్లోనూ మంచిపేరునే తెచ్చుకున్నారు. మిషన్‌ భగీరథ - మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఒక రకంగా మంచి మార్కులనే పొందింది. అయితే, క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం, ఇంకేమైనా చేయాల్సి ఉందా? లోటుపాట్లను సరిదిద్దుకోవడం కోసం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గ‌త ఏడాది మార్చి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు వంటి తదితర అన్ని ఏర్పాట్లను చేసుకున్నప్పటికీ...అప్పుడు రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు దృష్ట్యా జిల్లాల పర్యటనను వాయిదా వేసుకోవల్సిన పరిస్థితి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీనికి తోడుగా రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వచ్చినా…నామినేటెడ్‌ పదవుల భర్తీ అప్పటికి మొదలు కాలేదు.

కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా వరకు మార్కెట్‌ కమిటీలకు పాలక వర్గాలను నియమించారు. మిగతా నామినేటెడ్‌ పదవుల భర్తీపై ప్రభుత్వం దృష్టి మళ్లించింది. దీనికి తోడుగా ప్రజల పాలనా సౌలభ్యం కోసం కొత్త మండలాలను - జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గత ఏడాది రాష్ట్రంలో కురిసిన‌ భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. వర్షాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో చేపట్టిన చెరువులన్నీ నిండాయి. దీంతో ప్రజలందరూ ముఖ్యంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా 24 గంట‌ల క‌రెంటు ఇవ్వ‌డంతో రైత‌న్న‌ల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. దీంతో సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటనపై మరలా దృష్టిని పెట్టారని తెలుస్తోంది.

సంక్రాంతి పండుగ మ‌రుస‌టి రోజే సీఎం కేసీఆర్‌ సొంత జిల్లాలో ప‌ర్య‌టన‌కు శ్రీ‌కారం చుట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మెదక్‌ - సిద్దిపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. గజ్వేల్‌లో ఎడ్యుకేషన్‌ హబ్‌, 100 పడకల ఆస్పత్రిని - ఆడిటోరియం - ఎమ్మెల్యే క్వార్టర్స్‌ తో పాటు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు. తూప్రాన్‌ లో 50 పడకల ఆస్పత్రిని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే మర్కుక్‌ లోనూ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.