Begin typing your search above and press return to search.

కమలనాథులకు షాకిచ్చేలా కేసీఆర్ ఆట మొదలెట్టారా?

By:  Tupaki Desk   |   17 Sep 2019 5:12 AM GMT
కమలనాథులకు షాకిచ్చేలా కేసీఆర్ ఆట మొదలెట్టారా?
X
తెలివి ఎవరి సొత్తు కాదు. తనకు తానే మేధావిగా కీర్తించుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి అధినేతకు షాకిచ్చేలా కమలనాథులు పావులు కదుపుతుంటే.. గులాబీ బాస్ గమ్మున ఉంటారా? అంతకంతకూ అన్నట్లు వ్యవహరించరా? సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు.. ఉద్యమ ప్రస్థానం.. ఎప్పటికి రాదేమోనన్న తెలంగాణు తీసుకు రావటం ద్వారా అసాధ్యాన్ని సైతం సుసాధ్యం ఎలా చేయొచ్చన్న ఉదాహరణను చరిత్రకు అందించిన ఘనత కేసీఆర్ సొంతం.

అలాంటి ఆయనకు చెక్ పెట్టటం అంత ఈజీ కాదనే చెప్పాలి. తనకు తానుగా తీసుకునే నిర్ణయాలు.. కేసీఆర్ మైండ్ సెట్ తదితర అంశాలు ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తమైనా.. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే నేర్పు సారుకు అలవాటే. ఉద్యమ సమయంలో కేసీఆర్ మీద ఎంతటి ప్రేమాభిమానాలు పొంగాయో.. కొన్ని సందర్భాల్లో అంతకు భిన్నమైన ప్రతికూల వాతావరణం నెలకొనటాన్ని మర్చిపోకూడదు. తనకు వ్యతిరేకంగా వీచే గాలిని అనుకూలంగా మార్చుకోవటం ఎలా అన్నది ఊహకు అందని రీతిలో ఎత్తుగడలు వేయటం కేసీఆర్ కు అలవాటే.

ఉద్యమ నేతగా ఉండే పరిమితుల్లోనే తాను అనుకున్నట్లుగా గేమ్ సాగేలా చేసిన చతురత ఉన్న కేసీఆర్.. అధికారం తన చేతిలో ఉన్నప్పుడు పరిస్థితులు తన చేయి దాటకుండా ఉండేలా చేసుకోలేరా? సరిగ్గా ఇప్పుడు అలాంటి పనే చేశారని చెప్పాలి. యురేనియం తవ్వకాల విషయంలో మొదలైన ప్రజా ఉద్యమం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించటమే కాదు.. అది ముదిరి పాకాన పడే వరకూ గమ్మున ఉన్న ఆయన.. మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ హడావుడి పీక్స్ కు చేరుతున్న వేళ.. సడన్ ఎంట్రీ ఇచ్చి సిక్సర్ కొట్టేసిన నేర్పు చూస్తే.. కేసీఆరా మజాకానా? అన్న భావన కలుగక మానదు.

యురేనియం తవ్వకాల అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయన ప్రదర్శించిన చతురతను అభినందించకుండా ఉండలేం. ఎప్పుడేం మాట్లాడాలన్న దానిపై ఎంత స్పష్టత ఉందో.. ఎప్పుడేం మాట్లాడకూడదన్న దానిపైనా అంతే స్పష్టత కేసీఆర్ కు ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజా యురేనియం విషయంలో తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మార్చటమే కాదు.. సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకూ అందరూ ఈ విషయం మీద మాట్లాడేలా చేసి.. ప్రతిపక్షాలు హడావుడి చేసే వరకూ వెయిట్ చేసిన కేసీఆర్.. అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా ఏక వ్యాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.

ఇప్పుడు కానీ కేంద్రంలోని మోడీ సర్కారు నల్లమలలో యురేనియం తవ్వకాల విషయంలో అడుగు ముందుకు వేస్తే.. పచ్చటి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయటమే కమలనాథుల లక్ష్యమన్న ప్రచారంతో ఆ పార్టీకి ఉన్న కొద్దిపాటి ఇమేజ్ మొత్తం ఆవిరి అయ్యేలా కేసీఆర్ ప్లాన్ చేశారని చెప్పాలి. యురేనియం తవ్వకాల విషయంలో కేంద్రానికి చెక్ పెట్టటం ద్వారా కేసీఆర్ కమలనాథులకు ఇవ్వాల్సిన రీతిలో ఒక హెచ్చరికను ఇచ్చేశారని చెప్పకతప్పదు. మీరే కాదు.. నేనూ ఆట ఆడగలను.. నా జోలికి వస్తే ఇబ్బందులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తన తీరుతో స్పష్టం చేశారని చెప్పక తప్పదు. కేసీఆరా మజాకానా?