Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ‘కారణ జన్ముడు’ బిరుదు

By:  Tupaki Desk   |   21 April 2017 9:15 AM GMT
కేసీఆర్ కు ‘కారణ జన్ముడు’ బిరుదు
X
తెలంగాణ సీఎం - టీఆరెస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆ పార్టీ పెద్దలు సరికొత్త బిరుదు ఇచ్చారు. ఆయన కారణ జన్ముడంటూ టీఆరెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు అన్నారు. ఈ రోజు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో నిర్వహిస్తున్న ప్లీనరీలో మాట్లాడిన కేశవరావు కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. తనవి ప్లీనరీలో తొలి పలుకులు కావని, తన గుండెల్లోంచి వస్తున్న మాటలని కేకే అన్నారు. తెలంగాణలో సబ్బండ వర్ణాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్ నిజంగా కారణ జన్ముడని కేకే అన్నారు.

కాగా కేసీఆర్ ఇదే సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా 16వ సారి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అందరికీ కృతజ్ణతలు తెలిపారు. ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అదికారి నాయిని నరసింహారెడ్డి అందరికీ మన: పూర్వక నమస్కారాలు అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2001లో తెరాస ఆవిర్భవించిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. 2001లో గులాబి జెండా ఎగిరినప్పటికీ అన్నీ అనుమానాలే, ఈ పార్టీ ఉంటదా - తెలంగాణ వస్తదా - రానిస్తారా - పార్టీ పబ్బలో పుట్టింది - మఖలో పొతది అని ఎగతాళి కూడా చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని - నిలబడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. అంతే కాకుండా 75లక్షల సభ్యత్వం సాధించి దేశంలోనే ఒక పెద్ద పార్టీగా నిలబడిందని అన్నారు.

2014 జూన్ 2న తెలంగాణ వచ్చిందని.. ఆ వచ్చింది, అన్ని విధాలుగా విధ్వంసానికి గురైన తెలంగాణ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి తెలంగాణ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తదో - ఎప్పుడు పోతదో తెలియదు - సచివాలయం అంతా దళారీల గుంపులు - సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు - జిల్లా కలెక్టర్లు అక్కడ గోడలపై ఆత్మహత్యలు పరిష్కారం కాదు అని రాయించే పరిస్థితి. విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే విద్యుత్ ఉండదని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కరెంటు కోతలు లేని తెలంగాణ, సంక్షేమ తెలంగాణ - ఆసరా పింఛన్లతో ప్రారంభమై అన్ని విధాలుగా పురోభివృద్ధి బాటలో నడుస్తున్నామని కేసీఆర్ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/