Begin typing your search above and press return to search.

ఓరుగల్లు ధీమాః2019లో మాదే అధికారం

By:  Tupaki Desk   |   27 April 2017 3:30 PM GMT
ఓరుగల్లు ధీమాః2019లో మాదే అధికారం
X
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌మ‌దే అధికార‌మ‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ ఎస్ ఏర్ప‌డి 16 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌ లో ప్ర‌గతి నివేదన సభా వేదికగా కేసీఆర్ ప్రసంగించారు. ఎవ‌రు గ‌డ్డాలు పెంచినా ప్ర‌జ‌ల అండ‌తో రాబోయే ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి రానున్న‌ట్లు ధీమా వ్య‌క్తం చేశారు. మూడేళ్ల పరిపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అందరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చిందించాలనేదే తన ఆశయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వంలో రైతులు కన్నీళ్లు పెట్టుకోవద్దు.. ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ``చేనేత ఆకలి చావులు ఆగిపోవాలి, రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. గొల్ల కురుమలు లక్షాధికారులు కావాలి. పాలమూరు వలసలు ఆగిపోయాయి. వరంగల్ టెక్స్ టైల్స్ పార్కు వస్తే.. ముంబయికి వెళ్లిన నేత వలస కార్మికులు తిరిగి రావాలి`` అని సీఎం అన్నారు. కరెంట్ సమస్యను అధిగమించడంతో మోటార్లు కాలిపోవడం లేదు.. రైతన్నలు సంతోషపడుతున్నారు. ఇది రైతు రాజ్యమని సీఎం ఉద్ఘాటించారు. రైతుల వెంట నేనుంటానని కేసీఆర్‌ భరోసానిచ్చారు. ``రాష్ర్టం ఏర్పడిన వెంటనే కరెంట్ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేశాం. రాష్ర్టం ఏర్పడిన ఆరు నెలలు గడవకముందే విద్యుత్ సమస్యను అధిగమించామని చెప్పారు. కరెంట్ సమస్య అధిగమించడంతో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత పరిపాలన దృష్ట్యా జిల్లాల పునర్విభజన చేపట్టామని తెలిపారు. జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువైందన్నారు. పాలనసంస్కరణల కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం`` అని తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా గొల్ల - కురుమ - రజక - నాయి బ్రహ్మణ - కుమ్మరితో ఇతర కులాలను ఆదుకుంటున్నామని తెలిపారు. రూ. 40 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గ్రామగ్రామానికి మంచినీళ్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టామని తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. రూ. 43 వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను టీడీపీ, కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. గొర్రెల పంపిణీలో లంచాలు, పైరవీలు ఉండవన్నారు. అర్హులైన వారికి మాత్రమే పంపిణీ జరుగుతుందన్నారు. మత్స్య కార్మికుల కోసం బడ్జెట్ లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. రాష్ర్టంలో నాయి బ్రహ్మణులను ఆదుకుంటున్నామని ప్ర‌క‌టించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉండగా.. దాన్ని 21 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు చర్యలు చేపట్టామని కేసీఆర్‌ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కొరత ఉండే.. కానీ ఇప్పుడు ఎరువుల కొరత తీర్చామని ప్రకటించారు. రైతులకు రెండు పంటల కోసం ఎకరానికి రూ. 4 వేల చొప్పున వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పారు. మే 15 లోగా తొలి పంటకు, అక్టోబర్ 15 లోగా రెండో పంటకు నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు కావాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతు సంఘాలు ఏర్పడాలని ఆకాంక్షించారు.

తెలంగాణను క్రాప్ కాలనీలుగా విభజిస్తామని, రైతుల వెంట కేసీఆర్ ఉన్నారని కేటసీఆర్‌ భరోసా ఇచ్చారు. మనం పండించే పంటకు మనమే ధర నిర్ణయించాలని కేసీఆర్‌ సూచించారు. పట్టుబట్టి జట్టుకడితే మన పంటకు మనమే ధర చెప్పే పరిస్థితి వస్తుందన్నారు. రైతుల విషయంలో రాజీపడేది లేదన్నారు. రైతు రాజ్యమే ధ్యేయంగా తమ పాలన ఉంటుందని ఉద్ఘాటించారు. విద్యుత్, నీళ్లు, పెట్టుబడి ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ర్ట కర్షక సమాఖ్యకు బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/